హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను మరమ్మతు చేస్తున్నామంటూ రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. ఇప్పటివరకు బరాజ్‌ల వద్ద కనీసం తట్టెడు ఇసుకను తొలగించలేదు. బోర్‌హోల్ పరీక్షల నిర్వహణకు కావాల్సిన యంత్రా లు ఇంకా అక్కడికి చేరుకోలేదు. మరోవైపు నెలరోజుల్లో వానకాలం ప్రారంభం కానున్నది. నిర్దేశిత గడువులోగా కనీసం సాంకేతిక పరీక్షలు కూడా పూర్తయ్యే పరిస్థితులే కనిపించడం లేదు.
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను ఎన్డీఎస్ఏ సూచనల మేరకు చేపట్టాల్సి ఉంది. అందులో భాగంగా బరాజ్‌లకు సంబంధించి జియోఫిజికల్, జియో టెక్నికల్, జియో పెనెట్రేటింగ్ రాడార్ టెస్ట్‌లను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్) ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. ఆ టెస్టుల నివేదికలను సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏకు పంపి, డిజైన్లను కూడా రూపొందించి వాటికీ ఆమోదం పొందిన తరువాత పనులను చేపట్టాల్సి ఉంటుంది. టెస్టులను నెలాఖరులోగా పూర్తిచేస్తామని సర్కార్ వారం రోజులుగా ప్రగల్బాలు పలుకుతున్నది. అక్కడితో ఆగకుండా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కార్మికశాఖ మంత్రి వివేక్లతో కలిసి అట్టహాసంగా మేడిగడ్డలో పర్యటించి హడావుడి చేశారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్, సీడబ్ల్యూపీఆర్ఎస్ డైరెక్టర్ సెల్వ బాలన్, ఇరిగేషన్‌శాఖ అధికారులను వెంటబెట్టుకొని వెళ్లి క్షేత్రస్థాయిలో పనులను కొనసాగిస్తున్నట్టు పోజులిచ్చారు. అదంతా ఉట్టిదేనని ఇప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే తెలిసిపోతున్నది. టెస్టుల నిర్వహణకు మొదట బరాజ్ పియర్లు, రాఫ్ట్, గేట్ల మధ్య పేరుకుపోయిన ఇసుకను తొలగించాలి. కానీ ప్రస్తుతం టెస్టులను ప్రారంభించామని చెప్తున్న ప్రభుత్వం బరాజ్ పొడవునా ఎక్కడా తట్టెడు ఇసుకను తొలగించిన దాఖలాల్లేవు. బరాజ్ పొడవునా, రాఫ్ట్పైనా దాదాపు 5-8 మీటర్ల మేర ఇసుక మేటలు వేసింది. ఇక గేట్ల వద్ద, పియర్‌కు, పియర్‌కు మధ్యన కూడా ఇసుక మేటలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉన్నాయి. దీనిని బట్టి టెస్టుల ప్రగతి ఏ తీరుగా కొనసాగుతున్నదో తేటతెల్లమైపోతున్నది.
బరాజ్‌ల పునరుద్ధరణ పనుల్లో భాగంగా సీడబ్ల్యూపీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సానింగ్ , డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియోటెక్నికల్, జియోఫిజికల్ తదితర సాంకేతిక పరీక్షలు, అధ్యయనాలు నిర్వహించాల్సి ఉన్నది. సాంకేతిక పరీక్షలను వర్షాకాలం ముగిసేలోగా పూర్తిచేయాలని గడువును నిర్దేశించుకున్నట్టు సర్కార్ ప్రగల్భాలు పలికింది. మే 1 నుంచి 28లోగా సాంకేతిక పరీక్షలను పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్న ఏజెన్సీలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటుచేసింది. కానీ ఆచరణలో అవన్నీ పేరుకేనని తెలిసిపోతున్నది. క్షేత్రస్థాయిలో సాంకేతిక పరీక్షలు ముందుకు సాగడం లేదు. మరోవైపు ప్రభుత్వం నిర్దేశించుకున్న తేదీకి మిగిలి ఉన్న గడువు కేవలం 20 రోజులు మాత్రమే. జూన్ మొదటి వారానికల్లా గోదావరిలో, మరీ ముఖ్యంగా మేడిగడ్డ వద్ద ప్రాణహితలో వరద ప్రవాహం మొదలవుతుంది. నీటి ప్రవాహం ఆరంభమైతే సాంకేతిక పరీక్షలు ముందుకుసాగడం కష్టమే. ఆ తరువాత మళ్లీ వరదలు తగ్గే వరకు అంటే నవంబర్, డిసెంబర్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న తీరును చూస్తే నిర్దేశిత గడువులో పనులు పూర్తయ్యే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నది.
ఎన్డీఎస్ఏ సూచనల మేరకు, టెస్టుల కోసం బోర్‌హోల్స్‌ను వేయాలి. బరాజ్ పొడవునా, ప్రతి బ్లాక్‌లో పదుల సంఖ్యలో బోర్లు వేయాల్సి ఉంది. మొత్తంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లోనే సాంకేతిక పరీక్షల కోసం దాదాపు 520 బోర్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 13 చోట్ల మాత్రమే వేసినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. అందులోనూ మేడిగడ్డ బరాజ్‌లో 7వ బ్లాక్‌లో కుంగుబాటుకు గురైన 20, 21, 22 పిల్లర్ల వద్దనే పనులు ప్రారంభించడం సర్కార్ హడావుడికి అద్దం పడుతుంది. బోర్‌హోల్స్ టెస్టుల కోసం మేడిగడ్డ వద్ద 20 రిగ్ మెషిన్లు, అన్నారం వద్ద 24, సుందిళ్ల వద్ద 25, మొత్తంగా 69 మెషిన్లు అవసరమని అంచనా వేశారు. మేడిగడ్డ వద్ద 18 మెషిన్లను ఏర్పాటుచేసినా అందులో పనిచేస్తున్నవి కేవలం మూడే. ఇక అన్నారం వద్ద 2, సుందిళ్ల వద్ద ఒక రిగ్ మెషిన్‌ను మాత్రమే అందుబాటులో పెట్టారు. ఇప్పటివరకు మేడిగడ్డ వద్ద 12, సుందిళ్ల వద్ద ఒక్క బోర్‌హోల్స్ మాత్రమే వేశారు. అన్నారం బరాజ్ వద్ద పనులే ప్రారంభం కాలేదు. మేడిగడ్డ వద్ద రిగ్ అందుబాటులో ఉన్నా, కార్మికులు లేరని తెలుస్తున్నది. అత్తెసరు రిగ్ మెషిన్లు సైతం పూర్తిస్థాయిలో పనిచేయాలన్నా మరో వారం సమయం పడుతుందని సమాచారం.