హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉపఎన్నికకు శుక్రవారం నుంచి నామినేషన్లు మొదలవుతున్నాయి. 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఉపఎన్నికకు హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్‌రెడ్డిని రిటర్నింగ్ అధికారిగా నియమించారు. అభ్యర్థులు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. నామినేషన్ సమయంలో ఎలాంటి ఊరేగింపులు, మీటింగ్‌లకు అనుమతి లేదని పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ముందస్తుగా జాగ్రత్తలు సూచించిందని వివరించారు. గతంలో ఇచ్చిన కొవిడ్ మార్గదర్శకాల ప్రకారంగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు వేసేవారు మూడు వాహనాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలనికి వందమీటర్ల దూరం వరకుమాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుందని చెప్పారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితోపాటు ఇద్దరికి మాత్రమే లోపలకు ప్రవేశం ఉంటుందని తెలిపారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించడంతోపాటు, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే అభ్యర్థుల ఖర్చులను లెక్కిస్తామని సీఈవో
వివరించారు.