హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు కడపటి సమాచారం అందే సమయానికి 5,170 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లకు గడువు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అయితే అప్పటికే చాలామంది రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు చేరుకోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ల పర్వం రాత్రివరకూ కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలో భారీగా పోటీ నెలకొంది. గజ్వేల్‌లో సుమారు 152 మంది, కామారెడ్డిలో 64 మంది పోటీకి దిగారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే. తారకరామారావు పోటీచేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి 23 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 428 మంది నామినేషన్ వేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 236 మంది ఎన్నికల బరిలోకి దిగారు. అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో 5,035 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 13న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఎన్నికల బరి నుంచి ఉపసంహరించుకొనేందుకు ఈ నెల 15 వరకు గడువు విధించారు.
అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులను కేటాయించి నమూనా బ్యాలెట్ సీరియల్‌ను విడుదల చేస్తారు. దాదాపుగా అన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు తోడుగా డమ్మీ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఒకవేళ ప్రధాన అభ్యర్థి నామినేషన్ సాంకేతిక కారణాల రీత్యా తిరస్కరణకు గురైతే ముందుజాగ్రత్తగా తమ బంధువులు, ప్రముఖులతో నామినేషన్ వేయించారు. మరికొందరు అభ్యర్థులు రెండేసి, మూడేసి సెట్ల నామినేషన్లు వేశారు. ఈ కారణంగానే నామినేషన్ల సంఖ్య భారీగా ఉన్నట్టు తెలుస్తున్నది.