హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో పదవుల చిచ్చు ఆరేలా కనిపించడంలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు గుత్తా అమిత్రెడ్డిలకు నామినేటెడ్ పోస్టులపై పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. పార్టీ అధిష్ఠానం వారిద్దరూ బాధ్యతలు తీసుకోవద్దని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చింది. అయినా ఎవరికీ చెప్పకుండా.. డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా అమిత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. గత వారమే ఆయన నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చనీయాంశంగా మారింది.
గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయ వారసుడిగా ఆరంగేట్రం చేసిన అమిత్‌రెడ్డి తొలిసారి ప్రభుత్వ పదవిని సాధించుకున్నారు. ఇలాంటి సందర్భాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలనైనా పిలిచి, వారి సమక్షంలో బాధ్యతలు స్వీకరించాలి. విచిత్రంగా కనీస సమాచారం లేకుండానే హడావుడిగా ఒక్కడే వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. గుత్తా అమిత్ రెడ్డికి పదవి ఇవ్వడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌లో తుఫాను సృష్టించిందని చెప్పవచ్చు. జిల్లాలో పదుల సంఖ్యలో నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పనిచేస్తే.. వారెవ్వరికీ పదవులు ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి అప్పటికప్పుడు వచ్చి చేరిన అమిత్‌రెడ్డికి పదవి ఇవ్వడం పార్టీ సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.అమిత్‌కు పదవి రావడమే ఆల స్యం.. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు, మంత్రులు పార్టీ అధిష్ఠానం వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
నొచ్చుకున్న పెద్దాయన
నల్లగొండ జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేత వద్దకు జిల్లా నేతలు వెళ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో ఆయన గుత్తా అమిత్‌రెడ్డికి పదవి తీసుకోవద్దని వారించినట్టు తెలిసింది. ఆయనతోపాటు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కూడా పదవి తీసుకోవద్దని, స్వచ్ఛందంగా వదిలివేస్తున్నట్టు చెప్పాలని సూచించినట్టు తెలిసింది. గుత్తా అమిత్‌రెడ్డి మాత్రం ‘పెద్దాయన’ మాటను పట్టించుకోకుండానే వెళ్లి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయిందనిపించారు. దీంతో నల్లగొండ పెద్దాయన నొచ్చుకున్నట్టు సమాచారం. ఆయన జిల్లా నేతలతో కూడా చర్చించి ఇది పద్ధతి కాదని, పార్టీ బద్నాం అవుతోందని అన్నట్టు తెలిసింది.జిల్లాలో రేవంత్‌రెడ్డి వర్గంగా ఉంటున్నవారికి మాత్రమే పదవులు వస్తున్నాయని, ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పదవులు రావడంలేదని పలువురు నల్లగొండ నేతలు తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికే పటేల్ రమేశ్ రెడ్డికి పదవి ఇవ్వడం, బండ్రు శోభారాణికి ఇవ్వడం, తాజాగా అమిత్‌రెడ్డికి పదవి ఇవ్వడం అసంతృప్తికి గురిచేస్తున్నది. టీడీపీ మూలాలున్న వీరు రేవంత్‌రెడ్డి వర్గంగా ముద్రపడ్డారు. వీళ్లకే పదవులు ఇస్తూ పోతే మరి అసలు కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తున్నది.