హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): నిధులు కేటాయించడం లేదు.. మరోవైపు కేంద్ర పథకంతో లబ్ధిపొందాలని చూసినా అడ్డుకుంటున్నది. ఇదీ కాంగ్రెస్ సర్కార్ తీరు. రేవంత్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలోని సంచారజాతి కులాలు ఇబ్బందులు పడుతున్నారు. విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. బీసీ కమిషన్ ఆదేశించిన ఇప్పటికీ చలనం లేకపోవడం ప్రభుత్వం తీరుకు అద్దం పడుతున్నది.
తెలంగాణ సాంసృతిక పునర్వైభవంలో, కళలను రక్షించడంలో, వివిధ సేవా వృత్తులతో జీవితాలను సమాజ ప్రగతికి అంకితం చేసిన జాతుల్లో రాష్ట్ర డీనోటిఫైడ్ ట్రైబ్స్, నోమాడిక్ ట్రైబ్స్, సెమీ నోమాడిక్ ట్రైబ్స్ పోషించిన పాత్ర కీలకమైది. రాష్ట్రంలో మొత్తంగా 50జాతులు ఉన్నాయని బీసీ కమిషన్ సైతం నిర్ధారించింది. 40లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా. అవన్నీ బీసీ ‘ఏ’ జాబితాలో ఉన్నాయి. వారికి కనీస నివాసాలు అందుబాటులో లేవు. విద్య, ఉపాధి అవకాశాల్లోనూ వెనుకబడి ఉన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో విముక్త, సంచార, అర్ధసంచార కులాలు, జాతుల ప్రజల పరిస్థితి మరింత దయనీయం. దీంతో 35 సంచార జాతులను అత్యంత వెనుకబడిన వర్గాలుగా(ఎంబీసీ) గుర్తించారు. గత ప్రభుత్వం సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ సైతం ఏర్పాటు చేసింది. మరో 4 వడ్డెర, పూసల, మేదర, బోయ కులాలకు ఫెడరేషన్స్ ఏర్పాటు చేసింది. మరో 13 జాతులను బీసీ ‘ఏ’ జాబితాలో చేర్చింది. గురుకుల ప్రవేశాల్లో 5% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది. జీవనోపాధి కోసం రుణాలు సైతం మంజూరు చేసింది. కానీ కాంగ్రెస్ వచ్చాక ఎంబీసీలు, సంచారజాతుల పరిస్థితి దయనీయంగా మారింది.
నోటిఫైడ్ కాని సంచార(డీనోటిఫైడ్ ట్రైబ్స్), పాక్షిక-సంచార తెగల అభ్యున్నతి కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా స్కీమ్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీఎన్టీ(సీడ్) పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ ఏడాది కేంద్రం రూ.101కోట్లు కేటాయించింది. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, గృహాల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నది. విద్యా సాధికారత పేరిట పోటీపరీక్షలకు శిక్షణ పొందేందుకు విద్యార్థులకు రూ.1,500-3,000 వరకు నెలవారీ ఉపకారవేతనాలు మంజూరు చేస్తున్నది. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక భత్యాలు అందిస్తున్నది.
రాష్ట్రంలోని ఆయా జాతులు ఈ పథకాన్ని పొందలేని దుస్థితి నెలకొన్నది. అందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం. సీడ్ పథకం కింద లబ్ధి పొందాలంటే డీఎన్టీ కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, మండల అధికారులు కేవలం బీసీ ‘ఏ’ పేరిట మాత్రమే కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. దీంతో వారు సీడ్ పథకానికి అనర్హులుగా మిగిలిపోతున్నారు. రాష్ట్రం నుంచి ఆర్థిక సాయం అందక, కేంద్రం ద్వారా ప్రయోజనం పొందలేక సంచారజాతులు తీవ్రంగా నలిగిపోతున్నారు.
స్పందించని సర్కార్ సంచార, అర్ధ సంచార, విముక్త జాతులకు చెందిన ప్రతినిధులు తమ దయనీయ పరిస్థితిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు పలుమార్లు విన్నవించారు. బహిరంగ విచారణల్లోనూ ఫిర్యాదు చేశారు. సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించారు. బీసీ కమిషన్ చైర్మన్ సైతం సానుకూలంగానే స్పందించారు. రాష్ట్రంలో 50వరకు జాతులు ఉన్నాయని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయా జాతులకు డీఎన్టీ పేరిట కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వానికి ఏడాదిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సీడ్ పథకాన్ని పొందేందుకు అవకాశాలు కల్పించాలని సర్కార్‌కు ఇటీవల సైతం ప్రత్యేకంగా నివేదించారు. కానీ రేవంత్ సర్కార్‌లో ఇప్పటికీ చలనం లేకుండా పోయింది. బీసీ వెల్ఫేర్‌శాఖ ఉన్నతాధికారులు సైతం ఆయా జాతుల అభ్యున్నతిపై చిన్నచూపు చూస్తున్నారు.
రాష్ట్రంలో సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల అభివృద్ధి కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఎలాంటి ప్రయోజనం లేదు. కుల సర్టిఫికెట్లు లేకపోవడంతో కేంద్రం అమలు చేస్తున్న సీడ్ పథకాన్ని పొందలేకపోతున్నాం. బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి. బీసీ కమిషన్ ప్రతిపాదించిన అర్ధ సంచార, విముక్త జాతుల జాబితాను ఆమోదించాలి. డీఎన్టీ పేరిట కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి. బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి, పథకాలు అమలు చేయాలి.
-ఒంటెద్దు నరేందర్, తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు