Urea | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అడిషనల్ డైరెక్టర్లు కే విజయ్‌కుమార్, బీ నర్సింహారావు, జేడీఏలు ఎస్ గీత, వీ ఆశాకుమారి, వై సుచరిత, బీ బాలు, ఎం శైలజ, డీడీఏలు ఎం చంద్రశేఖర్, ఎం కనకరాజుకు బాధ్యతలు అప్పగించారు. వారికి అప్పగించిన జిల్లాల్లో యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.
ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నిల్వలు, పంపిణీని పర్యవేక్షించాలని పేర్కొన్నారు. యూరియా కొరతపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వ్యతిరేక వార్తలు ప్రసారమైతే వాటికి వివరణ ఇవ్వాలని స్పష్టంచేశారు. ఓ వైపు రాష్ట్రంలో యూరియా కొరత లేదని, అవసరమైన నిల్వలు ఉన్నాయని చెప్తున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రత్యేక అధికారులను నియమించాల్సిన అవసరం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని బట్టి ప్రభుత్వం పరోక్షంగా రాష్ట్రంలో యూరియా కొరతను అంగీకరిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.