Telangana | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువల పరిధిలో చేపట్టిన మరమ్మతులు ఎక్కడివి అక్కడే పడకేశాయి. సీజన్ గడచిపోతున్నా ఇప్పటికీ చాలాచోట్ల పనులే చేపట్టలేదు. పనులపై ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేకుండా పోయినట్టు తెలుస్తున్నది. మరోవైపు నీటిపారుదల శాఖను భారీగా కీలక పోస్టుల ఖాళీలు పట్టి పీడిస్తున్నాయి. ఫలితంగా నీటి నిర్వహణ గాడి తప్పి సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. కాలువలు, చెరువుల తూములు, పంప్‌హౌస్‌లు, ప్రాజెక్టుల గేట్లు తదితర మరమ్మతుల పర్యవేక్షణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఏఈ నుంచి సీఈల వరకు ఆర్థిక అధికారాలను బదలాయించింది.
అందులో భాగంగా మూడేండ్లుగా ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను ఓఅండ్ఎం విభాగమే పరిశీలిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన 1,294 పనుల్లో ఇప్పటికీ 478 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి మంజూరు చేసిన పనుల్లో దాదాపు 73 శాతం మొదలే కాలేదు. ప్రధానంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే మరమ్మతులు మందకొడిగా కొనసాగుతున్నాయని ఇంజినీరింగ్ అధికారులే వివరిస్తున్నారు. ఓఅండ్ఎం పనుల నిర్వహణకు వేసవి కాలమే అనువైనది. వర్షాకాలంలో వానలు, వరదలు, బురద వల్ల ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. శీతాకాలంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఉండి, నీటి విడుదల కొనసాగడంతో పనులు చేపట్టడం కష్టంగా ఉంటుంది. వేసవిలో నీటినిల్వలు తగ్గిపోయి, కాలువలకు నీటి విడుదల బంద్ చేయడం వల్లే సాధ్యమైనంత వేగంగా, సజావుగా మరమ్మతులు నిర్వహించవచ్చు. ఇందుకు 3 నెలలు మాత్రమే సమయం ఉంటుంది.
మందకొడిగా పనులు
ప్రస్తుతం ఓఎండ్‌ఎం పనులు మందకొడిగా కొనసాగుతున్నాయి. 2023-24లో 1,294 పనుల్లో 816 పనులే పూర్తి కావడం గమనార్హం. మరో 478 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 2024-25లో 926 పనులకు ఆమోదం తెలిపితే, కేవలం 247 (27శాతం) పనులే పూర్తికాగా, 73 శాతం పెండింగ్‌లో ఉన్నాయి. 272 పనులు టెండర్ దశలోనే ఉండిపోయాయి. ఒప్పంద దశలో మరో 126 పనులు ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే జూన్ నాటికి పూర్తిచేయడం కష్టమేనని తెలుస్తున్నది.
మరమ్మతులపై సర్కారు శీతకన్ను
ఓఅండ్ఎం పనులపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. అత్యవసర పనులపైనా ప్రభుత్వానికి పట్టింపులేకుండా పోయిం ది. ఈ ఏడాది భారీ వరదలకు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో పదు ల సంఖ్యలో చెరువులు తెగిపోయాయి. వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. శాశ్వత మరమ్మతులకు అనుమతులు ఇచ్చారు. కానీ ఇప్పటికీ ప్రారంభించలేదు. వివిధ ప్రాజెక్టుల్లో సత్వరమే చేపట్టాల్సిన పనులపైనా ప్రభుత్వం దృష్టిసారించిన దాఖలాలు లేవు.
నీటిపారుదల శాఖలో భారీగా ఖాళీలు
నీటిపారుదల శాఖలో భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ రెగ్యులర్ అధికారులను, సిబ్బందిని నియమించకుండా ఎఫ్ఏసీ బాధ్యతలను అప్పగించడంతో నీటి విడుదల పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో లేని దుస్థితి నెలకొన్నది. అదనపు బాధ్యతల నేపథ్యంలో పంటలకు నీటి విడుదలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో కమాండ్ ఏరియా పరిధిలోని ఆయకట్టుకు సైతం పూర్తిస్థాయిలో సాగునీరందని దుస్థితి నెలకొన్నది. దీంతో వ్యవ సాయ బోర్లన్నీ వెలవెలబోతూ పొట్ట దశలో పంటలు ఎండుతున్నాయి.
ప్రణాళికాలేమి తొలి వైఫల్యం..
ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎల్ఎండీ, మిడ్‌మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూరు, నాగార్జునసాగర్, శ్రీశైలం తదితర మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో తాగునీటి అవసరాలు పోగా, యాసంగికి 354.88 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) గత డిసెంబర్లో లెక్కతేల్చింది. మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని నిర్ణయించింది. మేజర్ ప్రాజెక్టుల్లో 277.59 టీఎంసీలు ఉండగా వాటి కింద 30.96 లక్షల ఎకరాలకు, మీడియం ప్రాజెక్టుల్లో 30.38 టీఎంసీలుండగా 2.68 లక్షల ఎకరాలకు, మైనర్ ప్రాజెక్టుల పరిధిలో 37.40 టీఎంసీలతో 7.23 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్ట్‌ల కింద 9.5 టీఎంసీలతో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చని అంచనాలు రూపొందించింది. వెట్క్రాప్స్కు 24.54 లక్షల ఎకరాలు, ఐడీ క్రాప్స్‌కు 17.94 లక్షల ఎకరాలకు నీరందించేందుకు తైబందీ ఖరారు చేసింది.
జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్‌లో మొత్తం 6 తడులకే నీరందించాలని నిర్ణయించింది. కమిటీ వేసిన ప్రణాళికలన్నీ ఇప్పుడు తారుమారయ్యాయి. అధికారులు వరి, ఆరుతడి పంటలకు తైబందీ ఖరారు చేయగా, క్షేత్రస్థాయిలో రైతులు అంచనాలకు మించి వరి సాగుకే మొగ్గుచూపారు. ఆరుతడి పంటల సాగు నామమాత్రంగా చేపట్టారని ఫీల్డ్ ఇంజినీర్లు చెప్తున్నారు. ఇదే విషయాన్ని ముందుగానే ఉన్నతాధికారులకు నివేదించామని, పూర్తిస్థాయిలో నీరివ్వలేమని, ప్రాజెక్టుల కింద ఆయకట్టును కుదించాలని తేల్చిచెప్పామని వివరిస్తున్నారు. చాలా చోట్ల ప్రాజెక్టుల ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాలువల్లో పూడిక పేరుకుపోయిందని చెప్తున్నారు. వివిధ కారణాలతో దిగువకు నిర్దేశించిన మొత్తంకంటే తక్కువే నీరు వెళ్తున్నదని వివరించారు. చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. అయినా వారి మాటలను పెడచెవిన పెట్టి ప్రణాళికలను రూపొందించారు.
క్షేత్రస్థాయి పర్యవేక్షకులేరీ?
సాగునీటి విడుదల పర్యవేక్షణను ప్ర భుత్వం గాలికి వదిలేసింది. నీటిపారుదలశాఖ ఇన్చార్జిల పాలనలోనే సాగుతున్నది. కీలక పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. పూర్తికాలపు అధికారులను నియమించకుండా ప్రభుత్వం ఇష్టారీతిన ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఏడాదిన్నరగా నెట్టుకువస్తున్నది. మొ త్తం 22 చీఫ్ ఇంజినీర్ పోస్టులు ఉంగా, 15 మంది విరమణ పొందారు. ఏడాది క్రితమే ఈఎన్సీ జనరల్ పోస్టు ఖాళీకాగా, ఓఅండ్ఎం ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈతోపాటు వివిధ జిల్లాల సీఈలంతా విరమణ పొందగా, ఈలు, ఎస్ఈలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పలువురు ఈఈలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ప్రధాన కార్యాలయాలకే పరిమితమయ్యారని వివరిస్తున్నారు. పనిభారంతో నీటివిడుదల పర్యవేక్షణపై ఏమాత్రం దృష్టిసారించలేని దుస్థితి నెలకొన్నది.చివరి ఆయకట్టు కాదు
మొదటికే మోసం..
రాష్ట్రవ్యాప్తంగా వానకాలంలో అత్యధిక వర్షాలు కురిశాయి. ప్రధాన ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. అయినా ప్రస్తుత యాసంగిలో చివరి ఆయకట్టుకు కాదుకదా మొదట ఉన్న ఆయకట్టుకే నీరందని విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రణాళికలు తారుమారు కావడం ఒకటైతే నిర్దేశిత షెడ్యూల్‌ను పాటించకపోవడం కూడా మరో కారణమని తెలుస్తున్నది. రిజర్వాయర్లలోని నీటినిల్వలను పరిగణలోకి తీసుకుని ఏ మేరకు సాగునీటిని ఇవ్వగలమో అంచనా వేసి ఆ మేరకు యాసంగి తైబందీని ఖరారు చేయడం పరిపాటి. కాలువల ద్వారా సమృద్ధిగా నీటిని విడుదల చేయడంతోపాటు చెరువులనూ నింపుతూ వస్తే భూగర్భజలాలు సమృద్ధిగా ఉండేది.
కానీ ఈ ఏడాది కేవలం 6 తడులే ఇస్తామన్న ప్రభుత్వం అదీ సమృద్ధిగా విడుదల చేయడం లేదు. మరోవైపు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ జోక్యం చేసుకుని ఒత్తిడి తెచ్చి తమ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేయించుకుంటున్నారని, దీంతో ముందస్తు ప్రణాళికలన్నీ చిన్నాభిన్నమయ్యాయని సంబంధిత అధికారులే వాపోతున్నారు. భూగర్భజలాలు అడుగంటడడంతో కాలువలపై ఎక్కడికక్కడ మోటర్లను పెట్టి నీళ్లను గతంలో కంటే ఎక్కువగా నీటిని రైతులు మళ్లించుకుంటున్నారని, డిస్ట్రిబ్యూటరీలకు నిర్దేశిత లెక్క ప్రకారం సాగునీరు సరఫరా కావడంలో వైఫల్యాలు ఏర్పడ్డాయని, నీటినిర్వహణ చిన్నాభిన్నమైందని వివరిస్తున్నారు.
నిధుల విడుదలలో నిర్లక్ష్యం
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఓఅండ్ఎం పనులు మందకొడిగా కొనసాగడానికి ప్రధాన కారణమని క్షేత్రస్థాయి ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఓఅండ్ఎం పనులకు 2023-24లో మొత్తం రూ.337.80 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం రూ.74.95 కోట్ల మేర పనులే పూర్తికాగా ఆ నిధుల్లోనూ 25 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇప్పటికీ రెండు త్రైమాసికాల నిధులనే ప్రభుత్వం విడుదల చేసింది. మిగతా 2 త్రైమాసికాల నిధులను ఇవ్వలేదు. బీఆర్వో విడుదల చేసిన నిధులను సైతం ఇప్పటికీ విదిల్చలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓఅండ్ఎం 205.66 కోట్ల పనులను మంజూరు చేయగా, రూ.17.70 కోట్ల పనులే పూర్తయ్యాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ రూపాయి విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పనులను చేపట్టేందుకు ఇంజినీరింగ్ అధికారులు జంకుతున్నారు.