Rythu Bharosa | హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో కౌలురైతులకు ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే పబ్బం గడుపుతున్నారు. రాష్ట్రంలో మీలా ంటి కౌలురైతులు 22 లక్షల మంది ఉన్నారు. 40% సాగుభూమి మీ ఆధీనంలోనే ఉన్నది. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80% కౌలురైతులే ఉన్నారు. ప్రభుత్వం మీపై కనికరం చూపడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కౌలురైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు రైతు భరోసా అందిస్తాం. కౌలురైతులెవరూ ఆందోళన చెందొద్దు..’ -ఇదీ 2023 సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుడి హోదాలో కౌలురైతులకు రేవంత్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖ. తీరా అధికారంలోకి వచ్చాక కౌలురైతులకు ధోకా ఇచ్చారు.
కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్న ఎన్నికల హామీని తుంగలో తొక్కారు. ఎన్నికలకు ముందు కౌలురైతులకు లేఖలు రాసిన ఆయన.. నేడు ఎగనామం పెట్టారు. కౌలురైతులకు కాంగ్రెస్ పార్టీనే దిక్కన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించారు. బహిరంగ లేఖలు రాయడమే కాదు… కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ, ఆరు గ్యారెంటీల్లోనూ కౌలురైతులకు రైతు భరోసా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రతి ఎన్నికల సభలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కూడా ఇదే హామీ ఇచ్చారు.
రేవంత్‌రెడ్డి పలు టీవీ చర్చల్లోనూ ఎలాంటి తడబాటు లేకుండా కచ్చితంగా కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ‘కౌలురైతులకు రైతు భరోసా ఇవ్వడం సాధ్యమేనా? ఏ విధానంలో కౌలురైతులకు రైతుభరోసా ఇద్దామనుకుంటున్నారు? వారిని ఏ విధంగా గుర్తిస్తారు?’ వంటి పలు ప్రశ్నలు రేవంత్‌రెడ్డికి ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు కూడా అందరినీ నమ్మించేలా ఆయన సమాధానం చెప్పడం గమనార్హం. 2011లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కౌలుదారు చట్టాన్ని అమలుచేస్తామని, గ్రామసభల ద్వారా కౌలురైతులను గుర్తించి రాష్ట్రంలోని ప్రతి కౌలురైతుకు రైతుభరోసా అందిస్తామని నమ్మబలికారు. కానీ, ఇప్పుడు వాటన్నింటిని పక్కనపెట్టేసి కౌలురైతులను నిండా ముంచారు.
దాదాపు ఆర్నెళ్లుగా రైతు భరోసా విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఏ సందర్భంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి గానీ, మంత్రులు గానీ కౌలురైతుల గురించి ఒక్కమాట మాట్లాడిన పాపానపోలేదు. రైతు భరోసాపై కసరత్తులో వీరి ప్రస్తావనే రాలేదు. కౌలురైతులకు రైతు భరోసా ఇచ్చే మార్గాలేమైనా ఉన్నాయా? అనే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఈ విధంగా రైతు భరోసా పథకంలో కౌలురైతులను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎత్తిచూపుతున్నది.
కౌలురైతులకు రైతుబంధు ఇవ్వడం సాధ్యం కాదని, అలా చేస్తే రైతులకు, కౌలు రైతులకు కొట్లాటలు పెరిగిపోతాయని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ వచ్చారు. కానీ, అధికారమే పరమావధిగా అమలకు సాధ్యంకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి కౌలురైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా నిజమేనని నమ్మారు. అందుకే కాంగ్రెస్‌కు అండగా నిలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు కూడా రైతు భరోసా వస్తుందని కౌలురైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, వారి ఆశలు ఆవిరయ్యాయి. రైతు భరోసాపై కౌలురైతులకు కాంగ్రెస్ మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో సుమారు 23-25 లక్షల మంది కౌలురైతులు ఉంటారని అంచనా. సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఎన్నికలకు ముందు కౌలురైతులకు రాసిన లేఖలో రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య 22 లక్షలని, వీరు సాగు చేసే భూమి 40% ఉంటుందని పేర్కొన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 23 లక్షల మంది కౌలురైతులకు ధోకా ఇచ్చినట్టయ్యింది.