Tummala Nageswara Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): యూరియా కోసం కొంతమంది కావాలనే రైతులతో క్యూలైన్లలో చెప్పులు, పాస్‌పుస్తకాలు పెట్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదని చెప్పారు. అయితే, ప్రాథమిక సహకార సంఘాల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు ఎందుకు గుమిగూడుతున్నారో, గంటలపాటు ఎందుకు వేచి చూస్తున్నారో కారణం మాత్రం మంత్రి చెప్పలేదు. మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘మంత్రి చెప్పినట్టుగా ఒకవేళ యూరియా అందుబాటులో ఉంటే.. పంపిణీ ఎందుకు ఆలస్యమవతున్నది? అధికారులు విఫలమవుతున్నారా?’ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
‘మళ్లీ యూరియా గోస’ శీర్షిక సోమవారం ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల యూరియా పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని పరోక్షంగా పేర్కొంటూ… రైతులతో కావాలనే క్యూలైన్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయించడంతోపాటు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రస్తుతం 1.4 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. మరో 80 వేల టన్నుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు వెల్లడించారు.