ప్రజలు వదంతులను నమ్మొద్దు
కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్ రద్దు
ఆయిల్ కంపెనీలు, పౌరసరఫరాలశాఖ
అధికారులతో మంత్రి గంగుల సమీక్ష
హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదని, అవసరమైనన్ని నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉన్నదంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో సివిల్ సైప్లె ఉన్నతాధికారులు, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెగ్యులర్గా ఉండాల్సిన 38,571 కిలో లీటర్లు పెట్రోల్, 23,875 కిలో లీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇవి నాలుగైదు రోజుల అవసరాలకు సరిపోతుందన్నారు. నిల్వల ఆధారంగా ఎప్పటికప్పుడు రాష్ర్టానికి పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతూనే ఉన్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ వినియోగం గతంలో మాదిరిగానే ఉన్నదని తెలిపారు. బంకుల్లో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సివిల్ సైప్లె కమిషనర్ అనిల్ కుమార్, ఆయిల్ కంపెనీల స్టేట్ కో ఆర్డినేటర్ మంగీలాల్, హెచ్పీసీఎల్ చీఫ్ మేనేజర్ యెతేంద్రపాల్ సింగ్,, బీపీసీఎల్ డీజీఎం కెఎస్వీ భాసర్రావు, ఐవోసీఎల్ జనరల్ మేనేజర్లు ఎన్ బాలకృష్ణ, ఎంబీ మనోహర్రాయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.