హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : ‘మనం ప్రభుత్వ ఉద్యోగులం కాదు.. 61 ఏండ్లకు రిటైర్మెంట్ కావడానికి! ప్రజా జీవితంలో రిటైర్మెంట్ అనేది ఉండదు. పదవీకాలం ముగిసిన మున్సిపల్, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాలి. మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలు గెలిపించుకుంటారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషనల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్పర్సన్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు తెలంగాణభవన్‌లో శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపాలిటీలు మురికి కూపాలుగా ఉండేవి.
బల్దియాలు అంటే ఖాయా పియా చల్దియా అనే సామెత ఉండేది. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్‌తో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణలోని పట్టణాలను మాడల్ పట్టణాలుగా తీర్చిదిద్దాం. అర్థిక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను, వాటి సమగ్రంగా డెవలప్చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యంగా పదేండ్ల్లు పనిచేసి గ్రామాలను, పట్టణాలను అన్ని అంశాల్లో అభివృద్ధి చేశాం. దేశ జనాభాలో 3% ఉన్న తెలంగాణకు జాతీయస్థాయిలో 30% అవార్డులు వచ్చాయి. మన పనితీరుకు ఆ అవార్డులే నిదర్శనం’ అని వివరించారు. మోసపూరిత 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు పాలన చేయడం రావడం లేదని దుయ్యబట్టారు. టకీ టకీమని రైతులకు పైసలు పడుతాయన్నారు.. కానీ, టకీటకీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు.
పదవీకాలం ముగిసిన చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉంటే ఫలితం దక్కుతుంది. మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలే మనల్ని గెలిపించుకుంటారు. 2028లో విజయం మనదే.
బీఆర్ఎస్ హయంలో పదేండ్లపాటు జరిగిన పట్టణాల అభివృద్ధి కేవలం డైలాగులు కొడితే కాలేదని కేటీఆర్ చెప్పారు. పక్కా ప్రణాళికతోపాటు అవసరమైన సంసరణలు, నిరంతర పర్యవేక్షణ, అవసరమైన నిధులు అందించడం వంటి నిరంతర ఫోకస్‌తోనే తెలంగాణలోని పట్టణాలు మాడల్ పట్టణాలుగా తయారయ్యాయని చెప్పారు. పదేండ్లుగా మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు పట్టణాల అభివృద్ధి కోసం అద్భుతంగా పనిచేశారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేశారని కొనియాడారు. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున పరిపాలన వికేంద్రీకరణ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పరిపాలన మరింత దగ్గర అయిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా కట్టాల్సింది పోయి హైడ్రా, మూసీ ప్రాజెక్టుల పేరుతో కూలగొడుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడిపే వారి ఆలోచనలు సానుకూలంగా ఉంటే రాష్ట్రం, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
నల్లగొండ పట్టణాన్ని సమూలంగా అభివృద్ధి చేసిన తనపై, కాంగ్రెస్ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీనియర్ అయ్యుండి కూడా కోమటిరెడ్డి పట్టణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నల్లగొండలో నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదని సిబ్బంది ఆందోళనలు చేపట్టినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆరున్నర లక్షల కొత్త రేషన్‌కార్డులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం రేషన్‌కార్డులు ఇవ్వలేదని అబద్ధాలు చెప్తున్నదని విమర్శించారు. డూప్లికేట్ గాంధీలకు తెలంగాణ ఇచ్చిన హామీలను అమలుచేసేలా బుద్ధి ప్రసాదించాలని మహాత్ముడి విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చినట్టు గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పట్టణాలతోపాటు ప్రజల ఆస్తుల విలువ కూడా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎకరం ధర రూ.3 లక్షలు ఉంటే, కేసీఆర్ పాలనలో 30 లక్షలు పలికింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడింది. ప్రజల ఆస్తుల విలువ కూడా భారీగా పడిపోయింది.
-కేటీఆర్
అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు కుటుంబసమేతంగా శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్, నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, శంకర్‌నాయక్, కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ పద్మాదేవేందర్‌రెడ్డి, నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.