హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఉక్రెయిన్ యుద్ధ సమయంలో దేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు వారి భవిష్యత్తు దృష్ట్యా బాసటగా నిలవాల్సిన కేంద్రప్రభుత్వం చేతులేత్తెసింది. విద్యార్థుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే తన బాధ్యతను విస్మరించి వారి పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల్లో భాగంగా శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేతకాని అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలు అంగీకరించవని తెలిపారు. ఇదిలావుండగా, చైనాలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న దేశ విద్యార్థులు కరోనా సమయంలో తిరిగొచ్చారని, మళ్లీ వెళ్లేందుకు వారికి పాస్పోర్ట్ ఇవ్వడంలేదని, దీనిపై కేం ద్రం ఎలాంటి చర్యలు తీసుకొన్నదని టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. చైనాను సంప్రదిస్తున్నామన్నారు.