హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా? పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్తారా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంట్లో దారుణంగా అబద్ధం చెప్పిన కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడును తక్షణం కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేశారు. కేంద్రమంత్రి గిరిజన జాతికి క్షమాపణ చెప్పేదాకా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపితే అది తమకు రాలేదనడం దుర్మార్గమని అన్నారు. కేంద్రప్రభుత్వం తీరుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు నిరసన ప్రదర్శనలు చేయాలని, బీజేపీ శవయాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ మాలోతు కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టాన్ని సాధించిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని గిరిజనుల స్థితిగతులు మారాలంటే జనాభా దామాషాకు అనుగుణంగా వారి రిజర్వేషన్లు పెంచాలని భావించి, ఆ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు.
గిరిజనుల రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంచేసి పార్లమెంట్‌కు పంపినప్పటి నుంచి ఇప్పటి దాకా ఐదేండ్లపాటు కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను పేరిస్తే బతుకమ్మ అంత ఎత్తు పేరుకొంటాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలు, మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ అధికారుల ఉత్తర ప్రత్యుత్తరాలు, అసెంబ్లీ తీర్మానం కాపీలు, గెజిట్ ప్రతులు కేంద్రం వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖకు, కేంద్ర హోంమంత్రిత్వశాఖకు మధ్య అనేక సంప్రదింపులు జరిగాయని వివరించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అర్జున్‌ముండా, అజయ్‌కుమార్ మిశ్రా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు వివరణ లేఖలు ఇచ్చిన విషయాన్ని మరచిపోయి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంట్‌ను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. అంతేకాకుండా 2018, 2019లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిని కలిసి రిజర్వేషన్ల సంఖ్యను తేల్చాలని కోరిన విషయాన్ని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు.
ఎస్టీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ఆమోదించినప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని, అదే ఉత్తమ్.. ఇప్పుడు ఎంపీగా రాష్ట్రప్రభుత్వం నుంచి ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదన ఏదైనా వచ్చిందా? అని పార్లమెంట్లో ప్రశ్నించడం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గిరిజనుల రిజర్వేషన్ బిల్లును ఎప్పటిలోగా ఆమోదిస్తారు అని కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి సిగ్గుమాలినతనంతో దిక్కుమాలిన ప్రశ్న అడిగారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తమ్ సోయి తప్పి ప్రశ్నిస్తే అంతకంటే సోయిపోయి కేంద్రమంత్రి జవాబిచ్చారన్నారు. వీరి వ్యవహారం ఫూల్స్ డ్రామాగా ఉన్నదని నిప్పులు చెరిగారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నేతలది సొల్లు పురాణమని విమర్శించారు. ఎస్టీ రిజర్వేషన్‌పై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంచేసిన సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఉన్నారని, అటువంటి వ్యక్తి కేంద్రమంత్రిగా పార్లమెంట్లో ఉండీ గిరిజన రిజర్వేషన్‌కోసం ప్రయత్నం చేయకపోగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అబద్ధాల పునాదులపైనే బీజేపీ పాలన చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని మరోసారి తేలిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏది అడిగినా నో డాటా అవైలబుల్ అంటుందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. కరోనాతో ఎంతమంది మరణించారని అడిగినా.. దేశంలో ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నా.. ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారన్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు రావాలని అడిగినా.. నో డాటా అవైలబుల్ అని చెప్పటమే కేంద్రం తీరు అని ధ్వజమెత్తారు. ఎన్డీఏ అంటేనే నో డాటా అవైలబుల్ అన్నట్టుగా మారిందని చెప్పారు. గిరిజనులు, దళితులు, మైనార్టీల అభ్యున్నతి కేంద్రానికి పట్టదని విమర్శించారు.
కేంద్ర మంత్రి మాటలు రాష్ట్ర గిరిజనుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతు కోయాలని చూస్తున్నదని, అందుకు తాము చూస్తూ ఊరుకోమని తేల్చిచెప్పారు. గిరిజన జాతినిఅవమానించిన కేంద్రమంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేదాకా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధ్దాలు చెప్పిన కేంద్రమంత్రి తన తప్పును తెలుసుకొని గిరిజనజాతికి క్షమాపణ చెప్పేదాకా విశ్రమించబోమని చెప్పారు.గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేడు ఆందోళనలు కేంద్రం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడ్తారన్నారు. పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామన్నారు. ఎస్టీ బిల్లు పాస్ చేసి రిజర్వేషన్లు పెంచి గిరిజనులకు న్యాయంచేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలోని గిరిజన తండాలు.. గోండు గూడేడెలు, చెంచుపెంటలు సహా అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, శవయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గిరిజన హక్కుల పరిరక్షణ, వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కవచంలా ఉన్నారని వారి అభివృద్ధికోసం సీఎం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు.
బీజేపీ నేతల బండారాన్ని, కేంద్ర ప్రభుత్వ పచ్చిమోసాన్ని బయటపెడతామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్టీల రిజర్వేషన్ ఏకగ్రీవ తీర్మానంలో పాల్గొన్న నాయకుడు ఉత్తమ్‌కుమార్ వేయాల్సిన ప్రశ్నేనా అని మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి సోయిలేని నాయకులను చూస్తే జాలేస్తుందన్నారు. అవగాహనలేని నేతలు అడిగితే అంతకన్నా దుర్మార్గంగా సమాధానం ఇచ్చిందన్నారు. కేంద్రం అసమర్థులతో పాలన సాగిస్తుందని తేలిపోయిందని ఎద్దేవాచేశారు. గిరిజన బిడ్డలను ఓటు బ్యాంకుగా వాడుకొన్న పార్టీలు మరొకసారి తమజాతికి మోసం చేయాలని చూస్తున్నాయని, ఇటువంటి పార్టీలకు గిరిజన బిడ్డలు తమ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. కరెంట్ సమస్యను తీర్చి, గిరిజన ఆవాసాలకు రోడ్లు సౌకర్యం కల్పించటమే కాకుండా అన్ని రంగాల్లో గిరిజనులు ఎదిగేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆమె వివరించారు. గిరిజనులు అమాయకులు వారిపట్ల ఏదైనా మాట్లాడొచ్చు అనే కేంద్రం నిర్లక్ష్య ధోరణిని బలంగా తిప్పికొట్టాలని కోరారు. గిరిజన జాతి కేంద్రంపై తిరగబడవలసిన అవసరం వచ్చిందన్నారు. 25 కోట్లమంది గిరిజనులున్న దేశంలో బడ్జెట్లో కేవలం రూ. 8వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే..రాష్ట్రంలో 30లక్షల జనాభా ఉంటే సీఎం కేసీఆర్ రూ. 12,500 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆమె ఉదహరించారు.