హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ)/హైదరాబాద్ సిటీబ్యూరో : రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో ఈ దుస్థితి మరింతగా నెలకొన్నది. మంగళవారం సాయంత్రం వరకు 70 శాతం బంకులు మూసివేయడం గమనార్హం. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదేమోననే ఆందోళనతో బంకులకు పరుగులు తీస్తున్నారు. తీసి ఉన్న బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. దొరికిన చోట తమ వాహనాల్లో ట్యాంక్‌ఫుల్ చేయించుకుంటున్నారు. దీనికి తోడు బాటిళ్లలోనూ స్టాక్ పెట్టుకుంటున్నారు. తాము ఆర్డర్ పెట్టినా స్టాక్ రాలేదని, అందుకే బంకులను మూసివేస్తున్నట్టు యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే భారత్ పెట్రోలియం స్టాక్ పాయింట్లు రెండురోజులపాటు మూతపడినట్టు తెలిసింది. ఆ తర్వాత సరఫరా మొదలైనప్పటికీ అదే ప్రభావం కొనసాగుతున్నదని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు చెప్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 3,600 పెట్రోల్ బంకులు ఉండగా, రోజూ సుమారు 35 లక్షల లీటర్ల పెట్రోల్, 45 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతాయి. డిమాండ్‌కు తగ్గట్టు పెట్రోల్, డీజిల్‌ను ఆయిల్ కంపెనీలు సరఫరా చేయడం లేదంటూ ఆయా బంకుల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే స్టాక్ సరఫరాలో అనధికారిక కోతలు విధిస్తున్నాయని చెప్పారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేకపోయినా సరఫరాలో అంతర్గత కోతలు పెడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇందుకోసం పలురకాల షరతులు విధిస్తున్నారని చెప్తున్నారు. మొన్నటివరకు స్టాక్ కావాలంటే అడ్వాన్స్ పేమెంట్ చేయాలని ఆదేశించారని, ఆ తర్వాత స్టాక్ కావాలంటే ఒకరోజు ముందే పేమెంట్ చేయాలన్నారని, తాజాగా తామే ఆన్లైన్ మానిటరింగ్ చేసి.. సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే ఒక బంకులో స్టాక్ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితిలోనే సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఏదైనా కారణాలతో అప్పటికీ స్టాక్ రాకపోతే బంకును మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు సేల్, స్టాక్ వివరాలు పంపాలని బంకుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.
రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఎక్కడా లేదని, అవసరమైన ఇంధనం సరఫరా అవుతున్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. అసత్య ప్రచారాలను నమ్ముతూ ప్రజలు ఆందోళన చెందవద్దని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా సక్రమంగానే ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెట్రోల్ బంకుల ముందు నోస్టాక్ బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం తప్పుడు వదంతులు నమ్మి ఒకేసారి జనాలు ఎగబడటమేనని తెలిపారు. అందరూ తమ వాహనాల కోసం పెద్ద ఎత్తున ఇంధనం కొనుగోలు చేస్తుండటంతో కూడా కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీలు అడ్వాన్స్ చెల్లింపు విధానాల్లో తెచ్చిన మార్పులతోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఇంధనాన్ని అక్రమంగా నిల్వచేసినా, బ్లాక్‌లో విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా సందేహాలు, ఫిర్యాదులుంటే 1967కు ఫోన్ చేయాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో వాహన ఎల్పీజీ గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఎల్పీజీ ధర రూ.63 ఉండగా, ఇప్పుడు రూ.90 దాటిందని వాపోతున్నారు. ఆయిల్ కంపెనీలు ఇంధన సరఫరా చేయడం లేదని ఎల్పీజీ, సీఎన్జీ బంక్‌ల వద్ద నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని వాపోయారు. సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోని బంక్‌ల వద్ద ఆటోలు ఎల్పీజీ, సీఎన్జీ కోసం భారీగా క్యూ కట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి.
ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక ఇప్పటికే ఆటో వాలాలు రాష్ట్రంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. 200 మంందికిపైగా ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఇలాంటి తరుణంలో గ్యాస్ ధరలు పెరుగడం, సరిపడా అందుబాటులో లేకపోవడం మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రభుత్వం స్పందించి ఎల్పీజీ గ్యాస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ అమ్మకాన్ని నిరోధించాలి.