పెద్దపల్లి టౌన్, నవంబర్ 25: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యు డు చాడ వెంకట్‌రెడ్డి సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో పేదలు బతికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రమాదకర విద్యుత్తు బిల్లు ప్రవేశపెట్టి రాష్ర్టాలపై రుద్దుతూ, వినియోగదారులపై నెలనెలా కరెంట్ చార్జీల మోత మోగిస్తున్నదని ఆరోపించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడారు.
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని తెలంగాణ, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక తదితర రాష్ర్టాలమీద కక్షసాధింపుతో దాడులు చేయిస్తూ అలజడి సృష్టిస్తున్నదని విమర్శించారు. మోదీ పాలనలో వ్యవసాయ, పారిశ్రామిక, కార్మిక, ప్రభుత్వ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మోదీ సర్కార్ కేవలం నలుగురి కోసం దేశాన్ని తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు. తెలంగాణ గవర్నర్ బీజేపీకి అనుకూలంగా మారడం మంచి పద్ధతి కాదన్నారు.
గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కన్నీళ్లు కారుస్తున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో ఎంతో మంది మేధావుల మీద కుట్రకేసులు పెట్టినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు ఎందుకు కన్నీళ్లు రాలేదో చెప్పాలని బండిని డిమాండ్ చేశారు.