హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : టీచర్లను తయారు చేసే డైట్ కాలేజీల్లో అధ్యాపకుల్లేరు. 94శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 10 డైట్ కాలేజీల్లో 286 అధ్యాపక పోస్టులుండగా 16 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 270 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు డైట్ కాలేజీల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. మరో రెండుకాలేజీలు కేవలం ఒకే ఒక్క లెక్చరర్‌తో నడుస్తున్నాయి.
అత్యధికంగా ఉన్నది నలుగురే..
రాష్ట్రంలో కొత్త టీచర్లను తయారు చేయాల్సిన డైట్ కాలేజీలు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక విలవిల్లాడుతున్నాయి. ఫ్యాకల్టీ లేక హైదరాబాద్‌లో (నేరేడుమెట్) డైట్ కాలేజీ గుర్తింపును ఎన్సీటీఈ నిలిపివేసి ఈ ఏడాది పునరుద్ధరించింది. మహబూబ్‌నగర్ డైట్ కాలేజీలో అత్యధికంగా నలుగురు ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. ఈ కాలేజీలో 29 పోస్టులకు 25 ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 29కి 29, వరంగల్‌లో 30కి 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్లగొండ, వికారాబాద్, మెదక్ డైట్ కాలేజీలు కేవలం ఒకే ఒక్క అధ్యాపకుడితో నడుస్తున్నాయి. ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ కాలేజీల్లో ఉన్నది ఇద్దరే. కరీంనగర్ డైట్ కాలేజీలో మాత్రమే ముగ్గురు రెగ్యులర్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం డీఎల్ఈఐడీ కోర్సుకు తీవ్ర డిమాండ్ ఉంది. 69 కాలేజీల్లో 4,350 సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలోని 3,750 సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే 3,462సీట్లు భర్తీ అయ్యాయి.