అటు సంక్షేమం, ఇటు ప్రగతి.. అటు గ్రామాల అభివృద్ధి, ఇటు పట్టణాల అభివృద్ధి.. అటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దూకుడు, ఇటు వ్యవసాయంలో దున్నుడు.. అటు పారిశ్రామిక వెలుగులు, ఇటు పర్యావరణ పరిరక్షణ చర్యలు.. ఇలా పరస్పర భిన్న రంగాల్లోనూ సంతులన, సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న అరుదైన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం దేశంలోనే సరికొత్త విప్లవమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. దళితుల అభ్యున్నతికి ఈ పథకం కొత్త దారులు చూపుతుందని చెప్పారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి ప్రభుత్వం తరఫున కేటీఆర్ శనివారం సమాధానమిచ్చారు. ఆగస్టు 16న కరీంనగర్లో జాతీయ దళిత సమ్మేళనం నిర్వహిస్తామని ప్రకటించారు. దేశంలోని దళిత మేధావులను ఆహ్వానించి దళితబంధు గొప్పతనాన్ని దేశమంతా చాటుతామని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 38,511 మందికి లబ్ధి చేకూరిందని, రూ.3,900 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే దళితబంధు తీసుకొచ్చారని కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టంచేశారు. ఎనిమిదేండ్ల పాలనలో ప్రధాని మోదీ ఈ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచమంతా హర్షిస్తున్నా మోదీకి, బీజేపీ నేతలకు మాత్రం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ వాళ్లు దేశానికి రోల్ మాడల్ అని చెప్తున్న గుజరాత్ నేడు పవర్ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని తెలిపారు. అక్కడ రైతులు గుజరాత్ విద్యుత్తుశాఖ మంత్రి ఇంటినే ముట్టడించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో కరెంట్ సమస్యను పరిష్కరించకపోతే స్వయంగా అధికారపార్టీ ఎమ్మెల్యేనే ఆందోళన చేపడతానని బీజేపీ సీఎంను హెచ్చరించారని గుర్తుచేశారు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టేటప్పు డు 2022వ సంవత్సరంలోపు దేశాన్ని మార్చేస్తానని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, దేశమంతా బుల్లెట్ ట్రైన్లు ఉరుకుతాయని, 57 లక్షల ఇండ్లు కట్టిస్తానని, ప్రతి భారతీయుడికి సొంతిల్లు ఉంటుందని, ప్రతి ఇంటికీ విద్యుత్తు అందిస్తానని, దేశ ఎకానమీ 5 ట్రిలియన్ డాలర్లు చేస్తానని, అంతరిక్షంలోకి దేశం నుంచి ఆస్ట్రోనాట్లను పంపుతానని హామీ ఇచ్చారని, ఇందులో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘హామీలన్నీ పక్కన పెడితే మోదీ మాత్రం ఎన్నో విషయాల్లో విజయాలు సాధించారు. 30 ఏండ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణం సాధించారు. నిరుద్యోగాన్ని 45 ఏండ్ల గరిష్ఠానికి చేర్చారు. వంట గ్యాస్ సిలిండర్ ధర విషయంలో దేశానికి నంబర్ వన్‌గా మార్చారు. అత్యధిక పెట్రోల్ ధరల్లోనూ మూడోస్థానంలో నిలిపారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తున్నదంటే, ఇది కేసీఆర్ కృషికి ఫలితం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. విద్యుత్తు రంగంలో అసాధారణ విజయాలు ఎలా సాధించవచ్చో తెలంగాణ విద్యుత్తు రంగం చాటి చెప్పిందని తెలిపారు. విద్యుత్తు మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ఆర్థికశాఖ నుంచి రాష్ట్ర ఆర్థికశాఖకు 2021లో లేఖ అందిందని (లేఖను చూపిస్తూ..) తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పాఠాలు చెప్పే ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో కాళేశ్వరం ఒక పాఠ్యాంశంగా మారిందంటే అది మన ఘనత కాదా? డిస్కవరీ చానల్ తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభను, సీఎం కేసీఆర్ కీర్తిని ప్రపంచానికి చాటింది. కాళేశ్వరాన్ని ప్రపంచమంతా గుర్తించింది.. కానీ ప్రధాని మోదీకి మాత్రం కనిపించడం లేదు. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్లడానికి అన్నికోట్లు ఖర్చు పెట్టొచ్చు కానీ.. రైతుల కడుపు నింపే కాళేశ్వరం కట్టొద్దా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో గతంలో ఎంపీ రంజిత్‌రెడ్డి ఇంటి కి వెళ్లినప్పుడు ఓ పెద్దాయన చెప్పిన ముచ్చట అందరికీ తెలియాలి. అయ్యా నా పేరు కృష్ణారెడ్డి. నేను రెండు దశాబ్దాల క్రితం మహబూబ్‌నగర్‌లో ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ పెట్టాను. ఒకప్పుడు కృష్ణారెడ్డీ నీ పొలమెక్కడ అని అడిగితే చెరువు కింద అని చెప్పేటోడ్ని. కానీ ఇప్పుడు చేను కిందకే చెరువు వచ్చిందని చెప్తున్నా. ఒకప్పుడు ఒక్క పంట గురించే ఆలోచించేటోళ్లం. కానీ ఇప్పుడు రొయ్యల చెరువు వేద్దామా? చేపల చెరువు వేద్దామా? అని ఆలోచిస్తున్నా అన్నారు. తెలంగాణ ప్రగతికి, కాళేశ్వరం గొప్ప తనానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది’ అని పేర్కొన్నారు.