పెంచిన మెట్రో చార్జీలను వెంటనే ఉపసంహరించు కోవాలని హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, కేపీ వివేకానందగౌడ్, మాగంటి గోపీనాథ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
Hyderabad Metro | హైదరాబాద్ మే 17 (నమస్తే తెలంగాణ): చార్జీల పెంపుతో నిత్యం మెట్రోలో ప్రయాణించే లక్షలాది ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రో, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో చార్జీలు పెంచి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు వారిని మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టడం బాధాకరమని వాపోయారు. టికెట్ రేట్లు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచడంతో సామాన్య ప్రయాణికుడిపై ప్రతి నెల సగటున రూ.500 నుంచి రూ.600 వరకు భారం పడుతుందని వాపోయారు. ప్రజలకు చవకైన, వేగవంతమైన, నమ్మకమైన సేవలందించాల్సిన ప్రజారవాణా వ్యవస్థల ప్రాథమిక లక్ష్యాన్ని నీరుగార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అంతర్జాతీయ నగరాలైన సింగపూర్, బెర్లిన్, టోక్యోల్లో ప్రభు త్వ సబ్సిడీలతో ప్రజా రవాణా వ్యవస్థలు నడుస్తున్నాయని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ప్రజారవాణాపై పగబట్టినట్టు స్పష్టమవుతున్నదని విమర్శించారు. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో ప్రజారవాణాను మరింత బలోపేతం చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మెట్రో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప ప్రైవేట్ కంపెనీల లాభా ల కోసం కాదనే విషయాన్ని సర్కారు గుర్తించాలని సూ చించారు. చార్జీల పెంపు ద్వారా ఇన్నాళ్లుగా మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్న లక్షలాది మంది ఉద్యోగు లు, యూనివర్సిటీ, కాలేజీల విద్యార్థులు ఇతర రవాణా మార్గాలకు మళ్లే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ సర్కారు హైడ్రా, మూసీ పేరిట సాగించిన విధ్వంసంతో వీధి వ్యాపారులు, పేదల బతుకులు కుదేలయ్యాయి. కమీషన్ల వేటలో రియల్ ఎస్టేట్‌ను ఆగం చేసి ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. ఆర్థిక ఇంజిన్ అయిన హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కుప్పకూల్చారు. ఇలాంటి అనేక సవాళ్ల మధ్య బతుకు పోరాటం చేస్తున్న బడుగు జీవులపై మెట్రో చార్జీల రూపంలో భారం మోపడం దుర్మార్గం’ అని బీఆర్ఎస్ శాసనసభ్యులు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మెట్రో చార్జీలను పెంచడం రివాజుగా మారిందని ఆరోపించారు. బెంగళూరులో 100 శాతం చార్జీల పెంపుతో ప్రయాణికులు 13 శాతం తగ్గిపోయారని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్పై కోపంతో అవసరమైన ప్రాంతాలకు మెట్రోను రద్దుచేసిన ప్రభుత్వం, మళ్లీ ఇప్పుడు విస్తరణ రాగం అందుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని, లేదంటే హైదరాబాద్ నగరవాసులు క్షమించబోరని హెచ్చరించారు.
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలం గాణ): హైదరాబాద్ మహానగరంపై సీఎం రేవంత్ పగబట్టారని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరుతో నగర ప్రజలకు అనేక సమస్యలు సృష్టించిన సీఎం.. తాజాగా మెట్రో రైలు చార్జీలను పెం చి పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపారని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని మెట్రో రైలులో ప్రతి టిక్కెట్‌పై అదనంగా రూ.20 వరకు పెంచారని, దీంతో మెట్రో ప్రయాణికుడికి ప్రతినెలా రూ.600కు పైగా అధిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కొన్ని నగరాల్లో మెట్రోచార్జీల పెంపుపై అక్కడి ప్రయాణికుల తిరుగుబాటుతో ప్రభుత్వాలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయని గుర్తుచేశారు.
హైదరాబాద్ మెట్రో రైలు చార్జీల పెంపు నిర్ణయాన్ని కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాలని, తిరోగమనం వైపు తీసుకెళ్లే ఏ నిర్ణయమూ మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికే ప్రతిపాదించిన కొత్త మెట్రో రైలు మార్గాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో, మెట్రో రైలు నష్టాల్లో నడిచినా.. చార్జీలను మాత్రం పెంచలేదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రజా రవాణాకు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా త క్కువే అని చెప్పారు. నగర పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో కూరుకుపోయిందని, ఈ దశలో నగర ప్రజలపై అదనపు భారాలు మోపడం సరికాదని సూచించారు.