గురుకులాల్లో రక్షాబంధన్‌కు సెలవు ఇవ్వలేదు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని బాలికల సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, సిబ్బంది కర్కశత్వంగా వ్యవహరించారు. తోబుట్టువులతో రాఖీలు కట్టిద్దామని పిల్లలతో కలిసి వచ్చిన తల్లిదండ్రులను సిబ్బంది అనుమతించలేదు. గంటల తరబడి వేచి చూసి కొంతమంది తిరిగి వెళ్లారు. ఇంకొంతమంది కిటికీలోంచి రాఖీ కట్టించుకున్నారు. ప్రిన్సిపాల్ పద్మ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. చివరకు చేసేదేమీలేక సిబ్బంది గేటు తీశారు. – సిరిసిల్ల రూరల్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ప్రకృతి ప్రేమికురాలు బ్లెస్సీ కాగితాలతో సుమారు వంద రాఖీలను తయారు చేసి, రక్షా బంధన్ వేళ చెట్లకు కట్టి తన అనుబంధాన్ని చాటుకున్నది. సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాశ్ కూతురు బ్లెస్సీ ఐదేండ్లుగా చెట్లకు రాఖీలు కడుతుండడాన్ని పలువురు అభినందిస్తున్నారు. -కోనరావుపేట
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్చెడ గ్రామంలో సోదరుడి విగ్రహానికి అక్కలు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. బోనగిరి సారయ్య-ఐలమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారు డు హరిప్రసాద్ మూడేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు విగ్రహం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అక్కలు శిరీష, ప్రవళిక రాఖీలు
కడుతున్నారు.
-చెన్నారావుపేట