హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉకుపాదం మోపాలని, వాటిని పూర్తిగా అణచివేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్‌చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత అలవాటుపడి వారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.‘ఎంజాయ్ పేరుతో గంజాయ్ వద్దు‘ అనే నినాదంతో ‘తెలంగాణ భాషా సాంసృతిక మండలి, తెలంగాణ ప్రజానాట్య మండలి’ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 27న హైదరాబాద్ నిజాంకళాశాల నుంచి ప్రారంభమైన ‘కళాజాత బస్సు యాత్ర’ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి.. ఆదివారం హైదరాబాద్ చేరుకున్నది.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్గూంభవన్లో యాత్ర నిర్వహించిన కళాకారులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, కార్యదర్శివర్గసభ్యుడు కలవేణ శంకర్ హాజరయ్యారు. అనంతరం బస్సు యాత్ర చేపట్టిన కళాకారులను శాలువాతో సతరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంసృతిక సలహా మండలి సభ్యుడు, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కే లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 2(నమస్తేతెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, కార్యదర్శి అశోక్‌రెడ్డి మాట్లాడారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కాంగ్రెస్ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.