హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు బీజేపీ మరోసారి ధోకా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులయిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వబోదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బుధవారం స్పష్టం చేశారు. ఇంటింటికీ మంచినీళ్లు అందించే మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, చెరువులను పునరుద్ధరించిన మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సూచన ఎందుకూ పనికిరాదన్నారు.
నీతి ఆయోగ్ చెప్పినట్టుగా రెండు పథకాలకు కలిపి రూ.24 వేల కోట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ రావని స్పష్టం చేశారు. పైగా నీతి ఆయోగ్ సూచనలు ఆ ఏడాదికే పరిమితం అని వ్యాఖ్యానించారు. ఈటల వ్యాఖ్యల ద్వారా రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచెయ్యి చూపినట్టేనని స్పష్టం అవుతున్నది. దీనిపై తెలంగాణవాదులు, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన పథకాలను కేంద్రం అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ వచ్చి మిషన్ భగీరథను ప్రారంభించింది, సీఎం కేసీఆర్ను ప్రశంసించింది, ఇన్నేండ్లలో పలువురు కేంద్రమంత్రులు పొగడ్తలు కురిపించింది అంతా డ్రామానేనా అని విమర్శిస్తున్నారు.