హైదరాబాద్, డిసెంబర్12 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపై కేంద్రం చేతులెత్తేసింది. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్‌కే నిధులను చెల్లిస్తామని లోక్‌సభ వేదికగా స్పష్టంచేయటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం రాజ్యసభ సమావేశాల్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నలు వేశారు. పోలవరం నిర్మాణానికి అంచనా వేసిన నిధులెన్ని? 2019 నుంచి ఏపీకి విడుదల చేసిన మొత్తం ఎంత? ప్రాజెక్టు పూర్తికి ఇంకా విడుదల చేయాల్సింది ఎంత? అని ప్రశ్నించారు. దీనిపై జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పోలవరం నిర్మాణానికి 2013-14 అంచనాల ప్రకారం రూ. 29,027.95 కోట్లు అవసరమని తేల్చగా, 2017-18 అంచనాల ప్రకారం ప్రస్తుతం రూ.47,725.74 కోట్లకు పెరిగిందని వివరించారు. 2016లో కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం మేరకు 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులే కేంద్రం చెల్లిస్తుందని తేల్చిచెప్పారు. దాని ప్రకారం కేంద్రం చెల్లించాల్సింది రూ. 15,667.90 కోట్లు అని, ఇప్పటికే రూ.13,226.04 కోట్లు చెల్లించామని, రూ. 2,441.86 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని వివరించారు.
పోలవరం నిర్మాణం కోసం 2019 నుంచి ఇప్పటి వరకు ఏపీకి రూ.6,461.88 కోట్లు విడుదల చేశామని తెలిపారు. కేంద్ర మంత్రి మాటలతో పునరావాసానికి నిధులు చెల్లంచబోమనే విషయం స్పష్టమైంది. వాస్తవానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే, నిర్మాణ వ్యయం భూసేకరణ, పునరావాసం ఖర్చులన్నీ కేంద్రమే భరించాలి. ప్రాజెక్టు అంచనా మొత్తం రూ.47,725.74 కోట్లలో రూ.20వేల కోట్ల వరకు భూసేకరణ, పునరావాసానికే లెక్కగట్టారు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పోలవరం ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో సైతం 890 ఎకరాలు ముంపునకు గురవుతాయని, 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే 40 వేల ఎకరాలు, 60 గ్రామాలకు ముప్పు పొంచి ఉందని ఇప్పటికే తెలంగాణ అనేకసార్లు వెల్లడించింది. ఇక్కడ పునరావాసం కోసం రూ.1,650 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా. ఆ దిశగా చర్యలు చేపట్టాలని, ఏపీకి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖలు రాసినా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పుడు కేంద్రం సైతం పునరావాసంపై చేతులు ఎత్తేయడంతో ఏపీ స్వయంగా ఆ నిధులన్నీ భరించాల్సిన పరిస్థితి ఉంది.