Telangana Secretariat | హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సచివాలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సచివాలయం చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్. సెక్రటేరియట్‌పై, దాని చుట్టూ డ్రోన్ ఎగరవేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
డ్రోన్లు ఎగరవేసి, గత ప్రభుత్వ కేసీఆర్ గుర్తులు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించినట్లు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రేవంత్ సర్కార్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదేనా ప్రజాపాలన అని నిలదీస్తున్నారు. గత ప్రభుత్వ అభివృద్ధిని ప్రశంసించే ప్రతి ఒక్కరిపై ఉక్కుపాదం మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.