Shambhaji nagar | (శంభాజీనగర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి మ్యాకం రవికుమార్): ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’ అన్నట్టుగా ఉంది చారిత్రక ఛత్రపతి శంభాజీనగర్ పట్టణం దుస్థితి. ఔరంగబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చారే తప్ప పట్టణ ప్రజల కష్టాలను మాత్రం తీర్చలేదు. జిల్లా కేంద్రంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లోనూ తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నది. జిల్లా కేంద్రంలో వారానికి ఒకసారి, కొన్ని ప్రాంతాల్లో 8 రోజులకు ఒకసారి నల్లా ద్వా రా, అది కూడా ఒక గంటకు మించి ఇవ్వడం లేదు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడాదిలో సగటున 50-60 రోజులు కూడా తాగునీరు సరఫరా చేయడం లేదు.
ఇచ్చేనీరు అంతంత మాత్రమే కావడంతో వచ్చినప్పుడే నిల్వ చేసుకొనేందుకు ప్రతి ఇంట్లో ట్యాంకులు, డ్రమ్ములే దర్శనమిస్తున్నాయి. నీటిని రోజుల తరబడి నిల్వ చేస్తూ తాగడంతో రోగాలబారిన పడుతున్నామని పట్టణవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అరకొరగా సాగునీటిని సరఫరా చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ పాలకులు నీటి బిల్లులను భారీగా వసూలు చేస్తూ దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. గృహాలకు ఏడాదికి రూ.4,050 చొప్పున నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. నీటి సరఫరా, బిల్లుల పెంపు అంశాలన్నీ ఔరంగాబాద్ సిటీ వాటర్ యుటిలిటీ కంపెనీ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని, ఏడాది నీటి బిల్లులను 10 శాతం పెంచుకొనేందుకు సదరు సంస్థకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో బిల్లుల మోత మోగుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తాగునీటికి ప్రణాళిక కరువు
శంభాజీపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో 2011 జనాభా లెక్కల ప్రకారమే 11 లక్షలకుపైగా జనాభా ఉన్నది. పట్టణానికి నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ఒక్క డ్యామ్, రిజర్వాయర్ కూడా లేదు. పట్టణానికి తొలుత హర్సూల్ లేక్ నుంచి కొద్ది మొత్తంలోనే నీరు సరఫరా అయ్యేది. ప్రస్తుతం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయక్వాడీ డ్యామ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి, పట్టణానికి సరఫరా చేస్తున్నారు. జయక్వాడీ డ్యామ్ ఎప్పుడూ పూర్తిగా నిండిన సందర్భాలు లేవు. ఒక ఏడాది నిండితే ఆరేండ్ల వరకు కూడా ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నిండని పరిస్థితి. డ్యామ్ నుంచి పట్టణానికి వేసిన పైప్‌లైన్ కూడా 700 ఎంఎం.. అది కూడా 30 ఏండ్ల క్రితం వేసింది కావడం గమనార్హం. సరఫరా చేస్తున్న నీరు పెద్ద మొత్తంలో లీకేజీ అవుతుండటంతో పట్టణంలో తాగునీటి కటకట నెలకొన్నది. పైఠాన్ డ్యామ్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.1,630 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి మూడేం డ్లు అవుతున్నా అది ముందుకు కదల్లేదు.
ట్యాంకర్లే దిక్కు!
పట్టణంలోని హాస్పిటళ్లు, పరిశ్రమలు, దుకాణా సముదాయాలు, నివాస సముదాయాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాగునీటి కోసం పడరాని పాట్లు పడాల్సిన దయనీయ పరిస్థితి. ప్రతినెలా తాగునీటి కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసుకుంటూ అవసరాలు తీర్చుకొంటున్నారు. 5 వేల లీటర్ల ట్యాంకుకు రూ. వెయ్యి చొప్పున, 2 వేల లీటర్ల ట్యాంకును రూ. 500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నీటి ఎద్దడి నెలకొనే మే, జూన్ నెలల్లో అయితే పరిస్థితి మరింత దారుణమని స్థానికులు వాపోతున్నారు. నీటి ట్యాంకర్ల నిర్వాహకులు రేట్లను విపరీతంగా పెంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక పట్టణంలోని చికల్థాన పారిశ్రామికవాడలో పరిస్థితి మరింత దారుణమని, తాగునీటి వసతి, ఇతర మౌలిక వసతుల లేమితో పదుల సంఖ్యలో ఇక్కడి పరిశ్రమలు మూతపడుతున్నాయని స్థానిక కార్మికులు వాపోతున్నారు.
కార్ఖానాలు మూతపడుతున్నయ్
మా తాగునీటి గోస ఎంత చెప్పుకున్నా ఒడవదు. వారంలో ఒకసా రి ఇస్తారు. ఒక్కోసారి అయితే 8 రోజులకు ఒకసారి నీళ్లు వస్తయ్. ఆ ఇచ్చేది కూడా కేవలం 40 నిమిషాలు మాత్రమే. పనులన్నీ వదులుకొని నీళ్లు పట్టుకుంటం. ఈ కార్ఖానా ఏరియాలో అయితే ఇంతకుముందు కనీసం 10 గంటలపాటు నీళ్లు ఇచ్చేటోళ్లు. ఇప్పుడు 3 గంటలు కూడా ఇస్తలేరు. నీళ్లు లేకనే కొన్ని కంపెనీలు మూతపడ్డయ్.
– అశోక్ పాక్రే, శంభాజీనగర్ పట్టణవాసి
పేరుమాత్రమే మారింది..
ప్రతిపక్షంలో ఉన్నంత వరకు నీళ్ల కష్టాలు అం టూ నాయకులు మాట్లాడుతరు. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్తరు. అధికారంలోకి వచ్చినంక పట్టించుకోరు. ఔరంగబాద్ పేరును అయితే మార్చారు కానీ తాగునీటి కష్టాలను తీర్చలేదు. మున్సిపల్ కార్పొరేషన్‌కు బిల్లును కట్టే బదులు ఆ పైసలు పెట్టుకొని బయట కొనుక్కునేడు నయం. అంతలా బిల్లులు వసూలు చేస్తున్నరు.
– విజయ్‌శర్మ, శంభాజీనగర్ పట్టణవాసి