హైదరాబాద్ జూలై 4 (నమస్తే తెలంగాణ): ‘నాడైనా నేడైనా బీఆర్ఎస్కు పదవులు తృణప్రాయం.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. సరిగ్గా 20 ఏండ్ల క్రితం 2005, జూలై 4న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల లాంటి అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నామని శుక్రవారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. రెండు దశాబ్దాలు దాటినా ఇదే పంథాలో ముందు కెళ్తున్నామని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాద స్ఫూర్తితో తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ముసుగులో గోదావరి నీళ్లను చెరబడుతుంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు.
ఏనాడైనా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను బీఆర్ఎస్ సహించబోదని హెచ్చరించారు. ‘పదవులను త్యజించడమే కాదు.. పేగులు తెగేదాకా కొట్లాడుతం’ అని తేల్చిచెప్పారు. ‘తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపలా ఉంటం.. కంటికి రెప్పలా కాపాడుకుంటం’ అని పునరుద్ఘాటించారు. ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతో పాతరేస్తం’ అని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.