హైదరాబాద్ జూన్ 13 (నమస్తేతెలంగాణ): ‘సాగునీటి రంగంపై నిబద్ధత లేదు.. విద్యావ్యవస్థపై బాధ్యతే లేదు.. వానకాలం సీజన్ మొదలవుతున్నా రైతు భరోసా అమలుపై ప్రణాళికే లేదు.. పాఠశాలలు ప్రారంభమైనా నిర్లక్ష్యం వీడటం లేదు’ అని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి వ్యవసాయమే కాదు, విద్యావ్యవస్థ కూడా కుంటుపడిందని శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో పండుగులా మారిన వ్యవసాయం..
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం వైపు పయనిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అరకొర రుణమాఫీ, ఆచూకీ లేని రైతుభరోసా, అందని రైతుబీమాయే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్ట్ శిఖమంత ఎత్తుకు ఎదిగిన తెలంగాణ విద్యావ్యవస్థ, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నదని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ నమస్తే తెలంగాణలో ప్రచురితమైన ‘గురుకులాలకు తాళం’ ఇతర పత్రికల్లో ప్రచురితమైన ‘రైతు భరోసా ఇంకెప్పుడు’ కథనాలను ట్యాగ్ చేశారు.
కాలుకు ఫ్యాక్చరై సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని శుక్రవారం కేటీఆర్ పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత వేగంగా కోలుకుంటున్నానని కేటీఆర్‌తో పల్లా చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాజేశ్వర్‌రెడ్డి త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఉన్నారు