హుజూరాబాద్ టౌన్, మే 10: నిరుపేద యువతుల పెండ్లి కోసం తెలంగాణ సరారు కల్యాణలక్ష్మి పథకాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కల్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు అమలవుతున్నాయా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని సాయిరూప గార్డెన్లో 505 మంది లబ్ధిదారులకు సుమారు రూ.5 కోట్లకుపైగా విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి గంగుల కమలాకర్ అందజేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు గొప్పవరమన్నారు. ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయితే కేసిఆర్ కిట్లు ఇస్తున్నామని, మగ బిడ్డ జన్మిస్తే రూ.12 వేలు, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13 వేలు అందజేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.