సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 22: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మాణ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో రూ. లక్ష బిల్లుకు ఒక్క రూపాయి మాత్రమే ఖాతాలో జమకావడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. మండల వ్యాప్తంగా 470 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచించారు. దీంతో రేకులషెడ్డు, గుడిసెలు, పెంకుటిండ్లు కూల్చి ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టారు. కొందరు బేస్మెంట్, రూఫ్ లెవల్ వరకు నిర్మించుకోగా పంచాయతీ కార్యదర్శి ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేశారు. నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంపై ఉన్నతాధికారులకు చెబితే టెక్నికల్ సమస్యతో బిల్లులు పడలేదని, రేపు మాపంటూ కాలం వెళ్లదీస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
లక్షకు ఒక్క రూపాయే వేశారు..
పాత ఇల్లు కూలగొట్టి, కిరాయి ఇంట్లో ఉంటూ ఇల్లు కడుతున్నాం. బేస్మెంట్ లెవల్ వరకు నిర్మాణ పనులు చేపట్టి నెల రోజులు గడుస్తున్నది. పంచాయతీ కార్యదర్శి ఫొటో కూడా తీసిండు. ఇంతవరకు బిల్లుల డబ్బులు పడలేదు. మిత్తీకి తెచ్చి ఇంటి నిర్మాణ పనులు చేపట్టా. బిల్లు కోసం అధికారుల చుట్టూ రోజూ తిరుగుతున్నా. లక్ష రూపాయలకు ఒక్క రూపాయే అకౌంట్లో పడింది. అధికారులకు చెబితే టెక్నికల్ సమస్యతో బిల్లు పడలేదని చెబుతున్నారు.
– చిట్టిప్రోలు రమేశ్, పుట్టపాక
లబ్ధిదారుల్లో కొందరికి బిల్లులు పడని మాట వాస్తవమే. బ్యాంకు ఖాతా సరిగా లేకపోవడం, ఆధార్ కార్డుల్లో వివరాలు తప్పుగా ఉన్నందున బిల్లులు పడటంలేదు. బిల్లులు రావడంలేదని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ప్రతి ఒక్కరికీ బిల్లులు పడతాయి. మండలవ్యాప్తంగా 470 ఇండ్లు మంజూరయ్యాయి. చాలా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. టెక్నికల్ సమస్య వల్లే లక్షకు బదులు ఒక్క రూపాయి అకౌంట్లో పడింది.
– ప్రమోద్ కుమార్, ఎంపీడీవో