హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపుదలే ముఖ్య లక్ష్యమని వల్లేవేస్తున్న ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రాజెక్టు పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజబులిటీ రిపోర్టు)ను సైతం మహారాష్ట్రకు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. వెరసి రేవంత్ సర్కార్ తీరుపై మహారాష్ట్ర తీవ్రంగా అభ్యంతరాలు చేసింది. సమావేశానికి ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. నామమాత్రంగా ఓ చీఫ్ ఇంజినీర్ మాత్రమే హాజరయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన తాజా అధ్యయన నివేదికలను సమర్పించిన అనంతరమే చర్చలకు సిద్ధమని తేల్చిచెప్పారు. 15 రోజుల్లో నివేదికలను అందిస్తామని తెలంగాణ అధికారులు హామీఇవ్వగా, సీడబ్ల్యూసీ చైర్మన్ సమావేశాన్ని అప్పటివరకు వాయిదా వేశారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై మహారాష్ట్రతో సమావేశాన్ని ఏర్పాటుచేయాల ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరిన నేపథ్యం లో కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాలతో మంగళవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర జలసంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వంలో కొనసాగిన ఈ భేటీకి రాష్ట్రం నుంచి ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్‌దాస్, సెక్రటరీ శ్రీధర్, ఈఎన్సీ రమేశ్‌బాబు, అంతర్రాష్ట్ర జలవిభాగం అధికారులు హాజరయ్యారు.
తమ్మిడిహట్టి వద్ద బరాజ్‌కు సంబంధించి గతంలో 148 మీటర్లతో చేసుకున్న ఒప్పందాన్ని సవరించాలని కోరారు. 152 మీటర్ల ఎత్తుతో బరాజ్‌ను నిర్మిస్తేనే గ్రావిటీ ద్వారా జలాలను తీసుకోవడం సాధ్యమని, ఈ నేపథ్యంలో ఆ మేరకు ఎత్తు పెంపుదలకు అంగీకరించాలని అధికారులు కోరారు. బరాజ్ ప్రతిపాదనలు, నీటి తరలింపు వ్యవస్థ, సీడబ్ల్యూపీఆర్ఎస్ అధ్యయనాలు, ముంపు తదితర అంశాలపై మహారాష్ట్రకు, సీడబ్ల్యూసీ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణ సర్కార్ తీరుపై మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ భేటీకి మహారాష్ట్ర సెక్రటరీ, ఈఎన్సీలు కాకుండా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒకే ఒక చీఫ్ ఇంజినీర్ సోనాలి హాజరయ్యారని తెలిసింది. తెలంగాణ అధికారుల ప్రజెంటేషన్‌పై ఆమె సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. తమ్మిడిహెట్టి బరాజ్, ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను సమర్పించకుండా ఏవిధంగా, ఏమని చర్చిస్తారని ప్రశ్నించినట్టు ఇరిగేషన్‌వర్గాలు వెల్లడించాయి.
నీటి లభ్యతపై తెలంగాణ అధికారులు సమర్పించిన గణాంకాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తంచేసినట్టు ఢిల్లీవర్గాలు తెలిపాయి. 2011నాటి హైడ్రాలజీ అధ్యయనాల ప్రకారం కాకుండా, గత 15 ఏండ్లకు సంబంధించినవి కూడా కలిపి తాజాగా హైడ్రాలజీ అధ్యయనం నిర్వహించాలని, సీడబ్ల్యూసీ ఆమోదించిన తరువాత వాటిని సమర్పించాలని మహారాష్ట్ర సీఈ తేల్చిచెప్పినట్టు ఢిల్లీవర్గాలు తెలిపాయి. నివేదికలన్నీ మహారాష్ట్రకు సమర్పించాలని, వాటన్నింటినీ పరిశీలించిన తరువాత తాము చర్చలకు సిద్ధమని స్పష్టంచేసినట్టు వివరించారు. దీంతో సమావేశం వాయిదాపడింది.