హైదరాబాద్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్-61 అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) కాలిపోయిన మెమొ రీ, మైక్రో కంట్రోలర్‌ను తనిఖీ చేసి ధ్రువీకరించాలంటూ అభ్యర్థుల నుంచి ఏ ఒక రాతపూర్వక దరఖాస్తు అందలేదని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు.
ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి తరువాత రెండు లేదా మూడో స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కోరిన పక్షంలో మొత్తం ఈవీఎంలలో 5% వరకు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్, వీవీపాట్లను త యారీ సంస్థల ఇంజినీర్ల బృందం తనిఖీ చేసి ధ్రువీకరించే అవకాశం ఉందని వెల్లడించారు. ఫలితాల తేదీ నుంచి ఏడు రోజుల్లోపు రాతపూర్వకంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఫలితాలు ప్రకటించిన నవంబర్ 14 నుంచి 21వరకు నిర్ణీత గడువులోపు జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారికి ఎలాంటి దరఖాస్తులు రాలేదని స్పష్టంచేశారు. ఎన్నికల నిర్వహణ మొత్తం భారత ఎన్నికల సంఘం నిర్ధేశించిన మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాల ప్రకారమే పారదర్శకంగా సాగిందని సీఈవో పేరొన్నారు.