సిద్దిపేట: సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆధరణ లభిస్తున్నది. సకల వసతులతో విద్యాబుద్దులు నేర్పిస్తున్న ఈ స్కూల్లో సీటు కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు. ఇప్పటికే అన్ని తరగతుల్లో సీట్లు నిండిపోవడంతో పాఠశాల యాజమాన్యం నో అడ్మిషన్ బోర్డు (No Admissions) పెట్టేసింది. 1200 మంది విద్యార్థుల చదువుకోవడానికి అవకాశం ఉన్న ఈ స్కూల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి సీటు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో స్కూల్లో ప్రవేశాలు ముగిసినట్లు బోర్డు పెట్టారు.
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అన్ని రకాల సదుపాయాలను సమకూర్చారు. పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం సమష్టి కృషి, విద్యార్థుల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని స్కూల్‌ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. పాఠశాల భవనాన్ని పునరుద్ధరించడంతో పాటు నాట్కో సంస్థ సహకారంతో ఆరు అదనపు తరగతి గదులు నిర్మించారు. అంతే కాకుండా పాఠశాలలో డిజిటల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ కోసం భవనం, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సదుపాయం, సోలార్ పవర్ యూనిట్, మోడల్ వంటశాల, వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. పాఠశాలలోని ప్రతి తరగతి సీసీ కెమెరాలకు అనుసంధానం చేసి ఉంది. ప్రతి రికార్డును ఆన్లైన్లోనే నిక్షిప్తం చేసి ఉంచుతారు.