NMC | న్యూఢిల్లీ: రోగనిర్ధారణ పరీక్షల కంటే ముందు యాంటీ బయాటిక్స్ను రోగులకు సూచించొద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. వైరస్లు, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ను తట్టుకొనేలా తయారవుతున్న నేపథ్యంలో వైద్యులకు కీలక సూచనలు చేసింది. ‘నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటిమైక్రోబయాల్ రెసిస్టెన్స్’ పేరుతో ఈ నెల 14న మార్గదర్శకాలను జారీ చేసింది. రోగులు వైద్య పరీక్షలు చేయించుకొనే ముందు యాంటీ బయాటిక్స్ వాడకుండా చూడాలని ఎన్ఎంసీ మార్గదర్శకాల్లో సూచించింది.
అత్యవసర సమయాల్లోనే.. అదీ డాక్టర్ రోగాన్ని గుర్తించలేకపోతేనే రక్త పరీక్షలకు ముందు యాంటీబయాటిక్స్ వాడాలని వెల్లడించింది. ఈ మధ్య కాలంలో వైద్యులు ప్రతి చిన్న రోగానికి యాంటీబయాటిక్స్ సిఫార్సు చేస్తున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు వెలువడటం గమనార్హం. రోగ కారకాలు యాంటీబయాటిక్స్ను తట్టుకొనేలా తయారైతే, వ్యాధి ముదిరి మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నదని గుర్తుచేస్తూ, యాంటీబయాటిక్స్ వాడకంపై కచ్చితమైన నిర్దేశం చేసింది. ఇచ్చే డోసు కూడా వ్యాధి తీవ్రతను బట్టి పెంచుతూ పోవాలని సూచించింది.