హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, ప్రయోగశాలలు, విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు సరిపడా మృతదేహాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఆయా కాలేజీల్లో గుర్తించిన లోపాలపై చర్చించేందుకు ఈనెల 18న ఢిల్లీలోని ఎన్ఎంసీ కార్యాలయానికి రావాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈకి ఎన్ఎంసీ నోటీసులు జారీ చేసింది. వసతులు లేవని గుర్తించిన 26 మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ సమావేశానికి వర్చువల్గా హాజరు కావాలని ఎన్ఎంసీ ఆదేశించింది. నిబంధనలు పాటించకుంటే ఊరుకునేది లేదని చెప్పింది.