హైదరాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సమయంలో భారత్‌బయోటెక్ సందర్శనకు వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రావద్దంటూ ప్రధానమంత్రి కార్యాలయమే సమాచారం ఇచ్చిందని, మొదట ప్రధాని మోదీ దీనిపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ నిలదీశారు. ‘సీఎం కేసీఆర్ వస్తానంటే వద్దన్నది ఎవరు? కేసీఆర్‌ను చూసి మీరు భయపడ్డారా? మిమ్ముల్ని చూసి కేసీఆర్ భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్‌లో కేసీఆర్‌పై మోదీ చేసిన ఆరోపణల గురించి తాజ్‌కృష్ణా హోటల్లో మీడియా అడిగిన ప్రశ్నలకు వినోద్‌కుమార్ సమాధానమిచ్చారు. స్వాగతించడానికి సీఎం రాలేదని చెప్తున్న మోదీ.. కొవిడ్ సమయంలో ఎందుకు రానివ్వలేదని ప్రశ్నించారు.
ఏ రాష్ట్రానికి పోయినా అక్కడికి ఎవ్వరినీ మోదీ రానివ్వరని, ఇటీవల చంద్రయాన్-3 విజయవంతం సందర్భంగా బెంగళూరుకు వచ్చిన సందర్భంలోనూ కర్ణాటక ముఖ్యమంత్రిని రానివ్వలేదని గుర్తుచేశారు. తన ఒక్కడికే గుర్తింపు రావాలని, తాను ఒక్కడే ప్రచారం పొందాలనే ఆలోచనే మోదీకి ఉంటుందని చెప్పారు. ఎన్డీఏలో చేరిక అంశాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాట్లాడేవన్నీ జుమ్లా మాటలని, నీటిమాటలని బీజేపీ నేత అమిత్‌షానే చెప్పారని, మోదీ వ్యాఖ్యలను కూడా అలాగే పరిగణించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. తెలంగాణ సాధించడానికి గొంగళి పురుగునైనా కౌగిలించుకుంటామని పార్టీ స్థాపించిన నాడే చెప్పామని గుర్తుచేశారు. తెలంగాణ సాధించిన తరువాత బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తున్నదని, అదే మాటపై ఇప్పటికీ ఉన్నామని పేర్కొన్నారు. తాము ఏ పార్టీతోనూ పొత్తులపై మాట్లాడలేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ అవినీతి గురించి బీఆర్ఎస్ బహిరంగంగానే చెప్పిందని, అదానీ, రాఫెల్ తదితర అంశాలపై పార్లమెంట్‌లోనూ, ఇతర వేదికలపైనా మాట్లాడామని గుర్తు చేశారు.