ఖలీల్‌వాడి, జనవరి 12: కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను తిరస్కరిస్తున్నారని, ప్రజలు ఇప్పటికీ కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్దేనని స్పష్టంచేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకూ వెళ్లి గత పదేండ్లలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నగర స్థాయి ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి మహిళకూ రూ.2,500 పెన్షన్ ఇప్పటికీ అమలు కాలేదని, రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలు చేస్తామని చెప్పి రెండేండ్లు కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు.
ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, విద్యా భరోసా కార్డు వంటి హామీలన్నీ గాల్లో కలిసిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా ఆ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, సర్పంచ్ ఎన్నికల్లోనే ఆ విషయం స్పష్టమైందని అన్నారు. బీజేపీ పని అయిపోయిందని, ఆ పార్టీ మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు సరిగ్గా చెప్పగలిగితే మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. గత పదేండ్లలో గణేశ్‌గుప్తా అర్బన్ అభివృద్ధికి అనేక కీలక పనులు చేశారని, ఒకప్పటి నిజామాబాద్‌తో పోలిస్తే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని, అది కేసీఆర్ నాయకత్వం, బిగాల గణేశ్ గుప్తా కృషి వల్లే సాధ్యమైందని కొనియాడారు.
బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి : కేఆర్ సురేశ్‌రెడ్డి
బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా ఉంచిన ఘనత అప్పటి కేసీఆర్ సర్కార్‌దేనని స్పష్టంచేశారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడిగే అర్హత బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఉన్నదని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ మేయర్ నీతూకిరణ్ శేఖర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు పాల్గొన్నారు.