ఆర్మూర్‌టౌన్/ఖలీల్‌వాడి, ఏప్రిల్ 21: దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, గారడీ మాటలు చెప్పే బీజేపీలకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ చర్చిలో ఆదివారం నిర్వహించిన క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల గ్రౌండ్లో ఉదయం అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి వాకర్స్‌తో ముచ్చటించారు. ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్‌కు ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు. తనను ఆశీర్వదించి లోక్‌సభకు పంపిస్తే తెలంగాణ సమస్యలపై గళమెత్తడంతోపాటు జిల్లా అభివృద్ధికి కోట్లాడి నిధులు తెచ్చే బాధ్య తీసుకుంటానని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటేయాలని ప్రజలను కోరారు.