రుద్రూర్, నవంబర్ 8: నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. స్టేషన్ బెయిల్ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. కోటయ్య క్యాంపునకు చెందిన నాగరాజుకు ఈ నెల 4న వర్ని వైన్స్ వద్ద శ్రీకాంత్‌తో గొడవ జరిగింది. నాగరాజుతోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ బెయిల్ కోసం వర్ని ఎస్సై కృష్ణకుమార్ రూ.50 వేలు డిమాండ్ చేయగా.. రూ.20 వేలకు బేరం కుదిరింది. దీంతో నాగరాజు ఏసీబీని ఆశ్రయించాడు. నాగరాజు శుక్రవారం ఉదయం డబ్బులతో పోలీసుస్టేషన్‌కు వచ్చి ఎస్సై కృష్ణకుమార్ చేతిలో పెట్టగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సైని విచారించి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్లు వేణుకుమార్, నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.