బోధన్, మార్చి 11: న్యాయం కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబును మంగళవారం కలువాలనుకున్న నిజాం షుగర్స్ కార్మికులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలోని శక్కర్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి కా ర్మిక నాయకుల ఇండ్లల్లోకి వెళ్లి అరెస్టు చే శారు. నిద్రిస్తున్న వారిని లేపి అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. 2015 డిసెంబర్ 23న నిజాం షుగర్స్‌కు ప్రైవేట్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించడంతో అప్పటివరకు ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు రోడ్డునపడ్డారు.
నిబంధనల మేరకు లేఆఫ్ కాలానికి నిర్దేశిత మొత్తంలో ప్రైవేట్ యాజమాన్యం కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా, పదేండ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ సమస్యను సీఎం రేవంత్‌కి వివరించి వేతనాలు చెల్లించే ఏర్పాటుచేయాలని కోరేందుకు మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లాలని కార్మిక నాయకులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లకుండా కార్మిక సంఘాల నేతలను అర్ధరాత్రి అరెస్టు చేశారు. సీఎం, మంత్రికి గోడు చెప్పుకోవాలని అనుకున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై కార్మిక నాయకులు మండిపడ్డారు. నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.