బంజారాహిల్స్, మార్చి 4: తమ పూర్వీకులైన నిజాంరాజుల పేర్లను వాడుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మునిమనుమడు హిమాయత్ అలీ మిర్జా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాంటి పార్టీలను కట్టడి చేసేందుకు ఎన్నికల నియమావళిని రూపొందించాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసినట్టు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని మాషా అల్లా మంజిల్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాంల హయాంలో హైదరాబాద్‌లో గణనీయమైన అభివృద్ది జరిగిందని, నేటికీ వారు నిర్మించిన కట్టడాలు, భవనాలు హైదరాబాద్ చారిత్రక వైభవాన్ని చాటిచెప్తున్నాయని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్ధప్రయోజనాల కోసం నిజాం పేరును ఎన్నికల ప్రచారంలో వాడుకొంటున్నాయని ఆరోపించారు. దీనిని అడ్డుకోవాలని ఇటీవల హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి లేఖ రాశానని తెలిపారు. భవిష్యత్తులో కూడా నిజాం పేరును ఎన్నికల ప్రచారంలో వాడుకోకుండా మాడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను రూపొందించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేయాలని, లేదా కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.