యాదగిరిగుట్ట, జూన్ 6: ప్రపంచమే అబ్బురపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో వైటీడీఏ, దేవస్థాన అధికారులు భక్తులకు అధునాతన మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే.. కొండకింద సకల వసతులతో నిత్యాన్నదాన సత్ర భవనాన్ని నిర్మిస్తున్నారు. వైటీడీఏ ఆధ్యర్యంలో రూ.8 కోట్లు, దాత వేగేష్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.14 కోట్లు కలిపి మొత్తం రూ.22 కోట్లతో పనులు ప్రారంభించారు. ఆర్టీసీ బస్ ప్రాంగణం పక్కనే 2.5 ఎకరాల స్థలంలో ఈ భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు.
85 శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21న ఈ నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఒక్కో హాల్లో ఏకకాలంలో 664 మంది భక్తులు భోజనం చేసేలా రెండు హాళ్లను నిర్మిస్తున్నారు. సువిశాలమైన వంటగది, కూరగాయలు భద్రపరిచే రూంలు, పెరుగు, పాల కోసం ప్రత్యేక గదిలో ఫ్రిజ్‌ల ఏర్పాటు, వీవీఐపీల భోజనం కోసం 20 మంది కూర్చునే విధంగా వీఐపీ గదిని తీర్చిదిద్దారు. రోజుకు ఎంతమంది భక్తులు వచ్చినా ఉచితంగా అన్నదానం చేసేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం సిద్ధమవుతున్నది.