హైదరాబాద్/శంషాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదని, దేశంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా ఎదుగుతున్నదని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ప్రశంసించారు. హైదరాబాద్ దేశానికి గ్రోత్ ఇంజిన్‌గా మారిందని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర సాగునీటి రంగానికి ప్రయోజనం కలగడంతోపాటు హైదరాబాద్‌లో పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతున్నదని అభివర్ణించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జీఎంఆర్ ఎరీనాలో జరిగిన సమావేశంలో 460 కిలోమీటర్ల జాతీయ రహదారులు, ఏడు పీఆర్ఐఎస్ ప్రాజెక్టు రోడ్లకు ప్రారంభోత్సవ, భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. ఒక రాష్ట్రం ప్రగతి సాధించాలంటే నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ రంగాల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందువరుసలో నిలుస్తున్నదని తెలిపారు. అమెరికాలో రోడ్ల నాణ్యత ఎంత పటిష్ఠంగా ఉంటుందో తెలంగాణ రోడ్లను అంతే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తామని చెప్పారు. అభివృద్ధి విషయంలో నేడు దేశం హైదరాబాద్‌ను ఆసక్తిగా గమనిస్తున్నదని చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధితోనే పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందుతాయని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పెద్దపల్లి మినహా మిగిలిన 32 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయని తెలిపారు. సాధ్యమైనంత తొందరలోనే ఆ జిల్లాను కూడా అనుసంధానం చేస్తామని చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాతీయ రహదారులు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2040 కిలోమీటర్లున్న జాతీయ రహదారులను నేడు 4996 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య జాతీయ రహదారులను ఉన్నతీకరించాలని, అనుసంధానం చేయాలని, లేని చోట ఏర్పాటు చేయాలని అన్నారు. దీంతో ఈ రాష్ర్టాల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతమని తెలిపారు. జాతీయ రహదారుల వెంట లాజిస్టిక్స్ పారులు నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మూడు నెలల్లో ట్రిపుల్ ఆర్కు శంకుస్థాపన
మూడు నెలల్లో హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ ప్రారంభానికి వస్తానని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్) పూర్తయిందని తెలిపారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని సినిమా ఇంకా మిగిలే ఉందని ఆయన రింగ్‌రోడ్డును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఎంపీలు కోరిన విధంగా త్వరలోనే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి సంబంధించి తీపికబురు చెప్తామని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో సత్ఫలితాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సత్ఫలితాలు వస్తున్నాయని నితిన్ గడరీ అన్నారు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో తీరని నీటి సమస్య ఉన్నదని, తెలంగాణకు ఆ సమస్య కాళేశ్వరంతో తీరిందని చెప్పారు. హైదరాబాద్ పారిశ్రామిక, ఐటీ పరిశ్రమల నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుగా కాళేశ్వరం మారిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా అనుమతులు ఇచ్చిందని తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ఇంజిన్
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో హైదరాబాద్ అద్భుతంగా పురోగమిస్తున్నదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతున్నదని ప్రశంసించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.. తెలంగాణ పురోగమిస్తే దేశం పురోగమిస్తుంది అని కేంద్రమంత్రి తెలిపారు.
తెలంగాణకు ఐదు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు..
దేశవ్యాప్తంగా కేంద్రం 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నదని ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఉంటాయని నితిన్‌గడ్కరీ తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం రూ. 3 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. రూ. 5 వేల కోట్లతో హైదరాబాద్ విశాఖపట్నం హైవే, రూ. 12 వేల కోట్లతో నాగపూర్ విజయవాడ హైవే నిర్మాణం చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తననెప్పుడు కలిసినా రాష్ట్ర పురోభివృద్ధి గురించి చర్చిస్తారని, అనేక ఉత్తరాలు రాసి తన రాష్ర్టానికి కావాల్సిన సౌకర్యాలను పొందేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ఎంపీలు సైతం తమ ప్రాంతాల పురోభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరతారని, అవకాశాలను, సందర్భాలను బట్టి వాటిని పరిష్కరంచేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగానికి ఆమోదించండి: వేముల
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి వెంటనే ఆమోదం తెలపాలని గడ్కరీని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నేషనల్ హైవే నెట్వర్ను మెరుగుపరచడం కోసం ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. ఇప్పటివరకు 2525 కి.మీ. పొడవు మాత్రమే నోటిఫై చేశారని, మిగిలిన 1138 కిమీ పొడవు రోడ్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో 10 జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లు, 7 సీఆర్ఎఫ్ రోడ్డు పనులకు భూమిపూజతోపాటు రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేసిన నితిన్ గడ్కరీకి సీఎం కేసీఆర్ తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో రహదారుల విస్తరణకు 180 కిలోమీటర్ల నూతన రోడ్లు అవసరమని, వాటి కోసం రూ. 500 కోట్లు కేటాయించాలని కోరారు. చౌటుప్పల్, షాద్‌నగర్ సంగారెడ్డి రోడ్డు, కరీంనగర్ కామారెడ్డి రోడ్డు, కొత్తకోట గద్వాల్ రోడ్డును కొత్తగా నిర్మించాల్సి ఉన్నదని తెలిపారు. ఇందుకోసం తమ ప్రభుత్వం భూసేకరణ చేసి ఇస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే శ్రీశైలం హైవేను నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం అందజేశారు.
బీజేపీ సభగా మారిన సమావేశం
రోడ్ల ప్రారంభోత్సవం, భూమిపూజ ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయినప్పటికీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు దీనిని పార్టీ సమావేశంగా మార్చివేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాషాయ కండువాలు కప్పుకొని హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. దీంతో సమావేశం ఒకదశలో పక్కదారి పట్టింది. కేంద్ర మంత్రులు పాల్గొన్న సమావేశంలో రాష్ట్ర మంత్రి మాట్లాడకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుతగలడంపై నితిన్ గడ్కరీ ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే తేరుకున్న కిషన్‌రెడ్డి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వారించారు. అధికారిక సమావేశంలో ఇలాంటి నినాదాలు చేయడం తగదని హెచ్చరించడంతో వారు నిలిపివేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, వీకే సింగ్, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాములు, రంజిత్‌రెడ్డి, దయాకర్, శ్రీనివాస్‌రెడ్డి, కే వెంకట్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, జాతీయ రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఒక రాష్ట్రం ప్రగతి సాధించటంలో నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్ రంగాలదే కీలకపాత్ర. ఈ రంగాల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందువరుసలో నిలుస్తున్నది. హైదరాబాద్ అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ పురోగమిస్తే దేశం పురోగమిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సత్ఫలితాలు వస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో నీటి సమస్య ఉన్నది. తెలంగాణకు ఆ సమస్య కాళేశ్వరంతో తీరింది. హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలు తీర్చేలా కాళేశ్వరం మారింది.
– కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
నీచమైన బీజేపీ.. మంచి మనిషి గడరీ
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వాఖ్య
బీజేపీ నీచమైన పార్టీ అని అందులో తనకు కనిపించిన ఏకైక మంచి మనిషి నితిన్ గడరీ మాత్రమేనని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం కేంద్రమంత్రి గడ్కరీ పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు వ్యవహరించిన తీరుపై వేముల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రుల అధికారిక నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారిక సమావేశానికి బీజేపీ కార్యకర్తలను తరలించారని విమర్శించారు. తాను తెలంగాణ ప్రభుత్వం తరఫున మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అడ్డుపడటం ఏమిటని ప్రశ్నించారు. ముగ్గురు కేంద్రమంత్రుల సాక్షిగా బీజేపీ కార్యకర్తలు చిల్లరగా వ్యవహరించి తెలంగాణ ప్రతిష్ఠను మంటగలిపారని మండిపడ్డారు.
ఆ కార్యక్రమంలో పాల్గొనాలని గడరీ లేఖ రాస్తేనే తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరయ్యానని చెప్పారు. బీజేపీ కండువాలు వేసుకొని ప్రభుత్వ కార్యక్రమంలో మూడు వేల మంది పాల్గొన్నారని తెలిపారు. తాను ప్రసంగం మొదలు పెట్టగానే వారు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారని అన్నారు. తాను మాట్లాడితే అంత ఉలికి పాటు ఎందుకని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే తెలంగాణకు రహదారులు ఇచ్చారని అన్నారు. ఏడేండ్ల కాలంలో రూ. 7 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది ఎంత? అని నిలదీశారు. కేవలం రూ.8 వేల కోట్లకు ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా? అని అన్నారు. తన ప్రసంగాన్ని ఆపినంత మాత్రాన నిజాలు ఆగకుండా ఉంటాయా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను అడుగుతానన్న భయంతోనే తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని చెప్పారు. కార్యకర్తలు చేసిన చిల్లర వ్యవహారానికి కేంద్రమంత్రి తనకు క్షమాపణ చెప్పారని తెలిపారు.