హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే (దొంగే దొంగా.. దొంగా అని అరిచినట్టు) అన్నట్టు ఉన్నది కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యవహారం. కేంద్ర విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదని లోక్సభ సాక్షిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాన్ని కూడా కిషన్రెడ్డి వక్రీకరిస్తూ అటు సభను, ఇటు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కేంద్ర విపత్తు నిధి నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్న వాస్తవాన్ని కప్పిపెట్టి అతి తెలివిగా ఎస్డీఆర్ఎఫ్ నిధుల జాబితాను మీడియాకు విడుదల చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలకు, కేంద్రానికి అనుకూలంగా ఉన్న రాష్ర్టాలకు మాత్రమే నిధులు ఇస్తూ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్నది తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల విమర్శ. దీనికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సూటిగా సమాధానం చెప్పకుండా రాష్ట్ర విపత్తు సహాయ నిధిలో (ఎస్డీఆర్ఎఫ్) కేంద్రం వాటా ఉందంటూ ఢిల్లీలో బుధవారం ప్రెస్మీట్ పెట్టి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు.
ఎన్డీఆర్ఎఫ్ జాబితా ఎందుకివ్వలే?
గడిచిన ఎనిమిదేండ్లలో హైదరాబాద్ వరదలతోసహా రాష్ట్రంలో అనేకమార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల అపార నష్టం జరిగింది. ఆ సమయంలో కేంద్రం వద్ద ఉండే ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్రమోదీని కోరినా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాసినా కేంద్రం స్పందించలేదు. ఈ నిధులు కేవలం బీజేపీ పాలిత రాష్ర్టాలకే పరిమితం అన్నట్టు ప్రవర్తిస్తున్నది. ఈ అంశంపై లోక్సభలో అస్సాం ఎంపీ ప్రద్యూత్ బోర్డోలాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సభలో విడుదల చేసిన ఎన్డీఆర్ఎఫ్ నిధుల జాబితాలో తెలంగాణకు నయా పైసా ఇవ్వని విషయం తేటతెల్లమైయింది. ఈ జాబితాను జత పరస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో కేంద్ర వివక్షపై నిలదీశారు. దీంతో తెలంగాణ పట్ల కేంద్ర వివక్ష ప్రజలకు అర్థమయ్యింది. ప్రజల్లో తమకు చెడ్డపేరు వస్తున్నదని గుర్తించిన కిషన్రెడ్డి తిమ్మిని బమ్మిని చేసి రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అనే రీతిలో ప్రచారం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదలలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదంటూ ఎస్డీఆర్ఎఫ్ నిధుల జాబితా విడుదల చేశారు.