హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలను ఎంతో అందంగా చెప్పారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల ఆమె నరనరాన వ్యతిరేకతను నింపుకొన్నారని మండిపడ్డారు. తెలుగువారి కోడలినని చెప్పుకొంటున్న నిర్మల తెలంగాణకు పైసా విదల్చకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి పదవికి ఆమె అనర్హులని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల తీరు వార్డు మెంబర్ కంటే అధ్వాన్నంగా ఉన్నదని నిప్పులు చెరిగారు. ప్రజల పైసలను ప్రజలకు ఇస్తున్న ప్రధాని మోదీ ఫొటోను రేషన్ దుకాణాల్లో ఎందుకు పెట్టాలని నిలదీశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని తెలిపారు. కుటుంబంలో ఒక్కొక్కరికి కేంద్రం 5 కిలోల బియ్యం బియ్యం ఇస్తుంటే.. తెలంగాణ 6 కిలోల చొప్పున ఇస్తున్నదని వివరించారు. మోదీ ఫోటో పెట్టాల్సి వస్తే పెంచిన ధరలకు నిరసనగా గ్యాస్ సిలిండర్లపై, ఎరువుల బస్తాలపై, పెట్రోల్ బంకులపై పెడతామని స్పష్టం చేశారు.
డీపీఆర్ అంటే తెలియని మీరూ మంత్రేనా?
డీపీఆర్ అంటే ఏమిటో తెలియని నిర్మల కేంద్ర మంత్రి కావడం దేశ ప్రజల దౌర్భాగ్యమని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఆమె అడ్డగోలు ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రే పార్లమెంట్లో వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.
రైతు ఆత్మహత్యలపై సిగ్గులేని మాటలా?
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్న నిర్మలమ్మకు గుజరాత్లో రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? అని పల్లా నిలదీశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని స్వయంగా కేంద్ర మంత్రే పార్లమెంట్లో చెప్తే.. నిర్మల మాత్రం రాష్ట్రంపై అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.
రైతుబంధు గురించి మాట్లాడే అర్హత ఉన్నదా?
రాష్ట్రంలో రైతుబంధు సరిగ్గా ఇవ్వడంలేదన్న నిర్మల వ్యాఖ్యలపై పల్లా మండిపడ్డారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.58 వేల కోట్లు అన్నదాతలకు అందిస్తే.. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా రూ.7,500 కోట్లు మాత్రమే అందించిందని గుర్తుచేశారు. ‘ఈ రెండు పథకాలకు ఏమైనా పోలిక ఉన్నదా? అసలు రైతుబంధు గురించి మాట్లాడే కనీస అర్హత నిర్మలకు ఉన్నదా?’ అని ప్రశ్నించారు.