న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నోరుజారారు. నిండు పార్లమెంటు సాక్షిగా తెలంగాణవాళ్ల భాషను అవమానించారు. తెలంగాణ నుంచి వచ్చే సభ్యులు ‘కమ్జోర్ (బలహీనమైన, నాసిరకం) హిందీ’ మాట్లాడుతారని ఆమె వ్యాఖ్యానించారు. సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి రూపాయి పతనంపై వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే సమయంలో ఇది చోటుచేసుకొంది.
“తెలంగాణ నుంచి వచ్చే గౌరవ సభ్యుల హిందీ కమ్జోర్గా ఉంటుంది. నా హిందీ కూడా కమ్జోర్గానే ఉంటుంది. కమ్జోర్ హిందీకి కమ్జోర్ హిందీలోనే జవాబిస్తాను” అని నిర్మల అన్నారు. చమత్కారానికో, మరోరకంగానో కాకుండా, నిర్మల చాలా సీరియస్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇలా అనడంతోనే సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. దీనిపై రేవంత్… తాను శూద్రుడిననీ, అందువల్ల బ్రాహ్మణవాదుల్లాగా స్వచ్ఛమైన హిందీ రాదని అభ్యంతరం వ్యక్తంచేశారు.
తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం, నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడం బీజేపీ ముఖ్యనేతలకు అలవాటుగా మారుతున్నది. బీజేపీ అగ్రనేత మోదీ తెలంగాణ ఏర్పాటుపై ఇప్పటికే అనేకమార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అనేక సందర్భాల్లో ఆయన ‘తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ’ ఆంధ్రప్రదేశ్ విభజనను తప్పుబట్టారు. మరోవైపు తెలంగాణలో పండిన యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని అడిగితే, తెలంగాణ ప్రజలు నూకలు తినొచ్చుగా అని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ ఎకసెక్కాలాడారు.
ఇక ఇప్పుడు తెలుగువారి కోడలినని చెప్పుకొనే నిర్మలేమో తెలంగాణవాళ్ల హిందీ కమ్జోర్ తెలంగాణ వాళ్లది ‘కమ్జోర్ హిందీ’ అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి దక్షిణాదిలో హిందీ బాగా మాట్లాడేది తెలంగాణ ప్రజలే. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీకన్నా తెలంగాణ ప్రజలు హిందీలో సాఫీగా మాట్లాడగలుగుతారు. అందుకే తెలంగాణను ఉత్తర-దక్షిణ భారతానికి భాషా వారధిగా భావిస్తారు. అందుకే హిందీ మాతృభాషగా కలిగిన లక్షలాది మంది హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారు. ఇదేమీ తెలుసుకోకుండా నిర్మల తెలంగాణను కించపరిచే రీతిలో, ప్రజలకు హిందీ రాదన్న రీతిలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిర్మల తీరుపై నెటిజనులు విరుచుకుపడుతున్నారు. కేంద్రమంత్రి తలపొగరుకు తెలంగాణ ప్రజలు తగిన రీతిలో సమాధానమిస్తారని ఒకరు పోస్టుపెడితే, సీఎం కేసీఆర్‌తో మాట్లాడితే తెలంగాణ హిందీ కమజోర్ అవునో కాదో నిర్మలకు తెలుస్తుందని మరొకరు పేర్కొన్నారు.