Revanth Reddy | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు మారలేదు. అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చుతూ సీఎం హోదాలో యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నిర్మల్‌లో నిర్వహించిన అధికారిక సభను కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచార సభగా మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వేదికపై సీఎం మాట్లాడుతూ ‘మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో 66 శాతంతో ఆశీర్వదించి నంబర్ వన్‌గా నిలబెట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాగే చేయండి.. మంత్రులతో పని చేయించుకునే వాళ్లను గెలిపించాలి. రూ. 10కి ఆశపడి ఓటేస్తే వాడు రూ. 100 కొల్లగొడతాడు’ అంటూ ఓటర్లకు పరోక్షంగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘నేను వాళ్లను గెలిపించండి, వీళ్లను గెలిపించండి అని చెప్పడం లేదు.. కానీ ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని గెలిపించండి’ అంటూ అచ్చంగా ఇటీవల సర్పంచ్ ఎన్నికల ముందు ఎలా మాట్లాడారో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు కూడా అలానే మాట్లాడారు. ‘తొందర్లోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతయి. టీవీలు, పేపర్లలో వస్తుంది. మంచోన్ని, మనోన్ని గెలిపించుకోవాలి’ అని చెప్పారు.
సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే తీరు.
డిసెంబర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సీఎం రేవంత్ ఇలాగే వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేైండ్లెన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో ప్రగతి సభల పేరుతో అధికారికంగా సభలు నిర్వహించారు. వీటిని సర్పంచ్ ఎన్నికల సభలుగా నిర్వహించారనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ప్రతి అధికారిక సభలోనూ సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రసంగించారు. పథకాల గురించి వివరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ప్రగతి సభల పేరుతో యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికార సభల వేదిక నుంచి ఎన్నికల ప్రచారాలు నిర్వహించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం కాలికి బలపం కట్టుకొని తిరిగి ఎన్నికల ప్రచారం చేసినా సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టారు. అధికార పార్టీ కుయుక్తులను తిప్పికొడుతూ.. పాలనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను ఆదరించారు. అధికార పక్షం హవా కొనసాగాల్సిన సర్పంచ్ ఎన్నికల్లో భిన్నంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ హవా కొనసాగింది. అచ్చంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఎంత ప్రయత్నించినా తన పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకోలేరని, ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.