లోకేశ్వరం, ఏప్రిల్ 9 : వేసిన పంటలను కాపాడుకునేందుకు ఆ రైతు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 బోర్లు వేశాడు. అయినా చుక్కనీరు పడలేదు. అటు పంటలసాగుకు, బోర్లు వేసేందుకు సుమారు రూ.7 లక్షలకు పైగా అప్పులయ్యాయి. పంటలు నిలువునా ఎండిపోవడంతో అప్పులు తీర్చే దారి కనిపించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ అన్నదాత తనువు చాలించాడు. విషాదకరమైన ఈ ఘటన నిర్మల్ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు పతాని నడిపి మల్లన్న (62) తనకున్న ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో ఈ సీజన్లో వరి, జొన్న పంటలను సాగుచేశాడు. సాగునీరు కరువై, భూగర్భజలాలు అడుగంటిపోగా, ఉన్న బోర్లు వట్టిపోయాయి. ఆ పంటలను కాపాడుకునేందుకు రైతు మల్లన్న కొత్తగా 20 బోర్లను వేశాడు. ఏ ఒక్కబోరులో చుక్కనీరు పడలేదు. పెట్టుబడికి, బోర్లు వేయడానికి దాదాపు రూ.7 లక్షలకు పైగా అప్పులు చేశాడు. దిగుబడి వచ్చే అవకాశం లేకపవడంతో మనస్తాపం చెందాడు. బుధవారం మధ్యాహ్నం పొలానికి వెళ్లొస్తానని ఇంటిలో చెప్పి వెళ్లాడు. తన వ్యవసాయ భూమిలోని వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లన్నకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.