Nirmal | నిర్మల్, జనవరి 29(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి బుధవారం ఓ యువతితో రాసలీలలాడుతూ పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. నిర్మల్ శివారులోని ఓ వెంచర్లో ని ర్మించిన నివాసగృహంలో సదరు ఉద్యోగితోపాటు ఓ యువతి రహస్యంగా కలుసుకున్నారని డయల్ 100కు ఫిర్యాదు రాగా నిర్మల్ రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో సదరు ఉద్యోగి యువతిని గదిలోనే ఉంచి తాళం వేసి పరారయ్యా డు.
పోలీసులు తాళం పగులగొట్టి గదిలో నుంచి యువతిని బయటికి తీసుకొచ్చారు. అనంతరం సఖి సెంటర్లో పూర్తి వివరాలు సేకరించి వదిలేసినట్టు తెలిసింది. ఘటన జరిగిన రోజు ఆ ఉద్యోగి కార్యాలయానికి రాలేదని తోటి ఉద్యోగులు తెలిపారు. ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేయగా, కలెక్టరేట్లో కీలక బాధ్యతల నుంచి సదరు ఉద్యోగిని తప్పించినట్టు సమాచారం. నిర్మల్ రూరల్ సీఐని వివరణ కోరగా ఫిర్యాదు వచ్చింది వాస్తవమేనని, ఘటనా స్థలంలో సదరు ఉద్యోగి లేకపోవడంతో యువతిని విచారించామని తెలిపారు. వారి మధ్య కొంతకాలంగా స్నేహం ఉన్నదని యువతి పేర్కొన్నదని వెల్లడించారు.