నిర్మల్ జిల్లాలో ఒక పల్లె వెలుగు బస్సులో 55 మంది సామర్థ్యానికి సుమారు 80 మంది వరకు ప్రయాణికులు ఎక్కారు. అయితే అందులో ఉన్నది కేవలం ఇద్దరే పురుషులు. అటువంటి పరిస్థితిలో కూడా ఆర్టీసీ డిపో మేనేజర్లు ‘డబ్బులు తెండి.. డబ్బులు తెండి’ అంటూ కండక్టర్లను పీడిస్తున్నారట. ఈ విషయం తెలిసిన బస్సులోని ఓ యువకుడు ‘కండక్టర్లపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. బస్సునిండా మహిళలే ఉంటే.. ఇంకా యాడికెల్లి తీస్కరావాలి పైసలు?’ అంటూ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ‘అన్నీ ఆధార్‌కార్డు టికెట్లేనా? డబ్బులేవి? కనీసం 60 శాతం క్యాష్ తీసుకురావాలన్న టార్గెట్లు మర్చిపోతే ఎట్లా? మళ్లీ ఇది రిపీట్ అయితే మెమోలు అందుకోవాల్సి వస్తుంది జాగ్రత్త’ అంటూ డిపో మేనేజర్లు కండక్టర్లను వేధింపులకు గురి చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా యాజమాన్యం నుంచి వస్తున్న ఆదేశాలంటూ డిపో మేనేజర్లు పెడుతున్న టార్గెట్లు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో ‘మహాలక్ష్మి పథకం’ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో కండక్టర్ల పని స్వరూపమే మారిపోయిందని సిబ్బంది చెప్తున్నారు.
బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగినా అందులో చెల్లింపులు చేసే పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో క్యాష్ కలెక్షన్ తగ్గుతున్నదని అంటున్నారు.అయినప్పటికీ పాత తరహాలోనే ఆదాయ లక్ష్యాలు విధించడం వల్ల తమపై ఒత్తిడి పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీల్లో ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల్లో మహిళా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటున్న విషయం యాజమాన్యం దృష్టిలో ఉన్నా.. డిపో మేనేజర్ల ద్వారా కండక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని తెలిసింది. హైదరాబాద్‌లోని కొన్ని డిపోల్లో కండక్టర్లకు రోజుకు రూ.10 వేల కలెక్షన్ తీసుకురావాలని అధికారులు ఆదేశించినట్టు సమాచారం.
మహాలక్ష్మి ప్రయాణికులతో బస్సులు 95-100 శాతం నిండుతున్నా ఆదాయం పెరుగడం లేదని, అలాంటి పరిస్థితుల్లో టార్గెట్ ఎలా సాధ్యమవుతుందని కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళల వాటా 75 శాతం వరకు ఉంటున్నదని సాక్షాత్తు ఉన్నతాధికారులే చెప్తున్నా.. 60శాతం క్యాష్ ఉండాలనే టార్గెట్లు పెట్టడం ముమ్మాటికీ దారుణమని అంటున్నారు. కలెక్షన్ తకువగా వచ్చిందని వివరణ కోరడం, మెమోలు ఇవ్వడం, పనితీరుపై ప్రశ్నించడం వంటి చర్యలు పెరిగాయని కండక్టర్లు చెప్తున్నారు. ఉచిత ప్రయాణం ప్రధానంగా అమలవుతున్న పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో పనిచేసే కండక్టర్లపై ఒత్తిడి ఎకువగా ఉన్నదని అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో సంస్థకు వందల కోట్లలో నష్టం నమోదవుతున్నా.. ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో ప్రతినెలా సహకారం లేదని సమాచారం.
రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రతి మహిళా ప్రయాణికురాలి గుర్తింపు కార్డు (ఆధార్) చూసి జీరో టికెట్ ఇవ్వడం కండక్టర్లకు ప్రాణసంకటంగా మారింది. చిన్న పొరపాటు జరిగినా చెకింగ్ స్టాఫ్ ఫైన్లు వేస్తారనే భయం వారిని వెంటాడుతున్నది. పాత టిమ్‌లు తరచూ మొరాయిస్తుండటంతో టికెట్ల జారీ ఆలస్యమై ప్రయాణికులతో గొడవలు జరుగుతున్నాయి. నెట్వర్ సమస్యల వల్ల సిగ్నల్ అందక చార్జింగ్, డాటా అప్డేట్ లోపాలతో యూపీఐ పేమెంట్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. కండక్టర్లను ఆర్టీసీ యాజమాన్యం వేధింపులకు గురిచేయడం సరికాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం చేతికి వచ్చిన క్యాష్‌నే లెక్కిస్తూ టార్గెట్లు పెట్టడం సమంజసం కాదని హెచ్చరిస్తున్నాయి.