హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాట్లు పట్టడం లేదని, విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువులకు ఎన్నడూ కొరత రాలేదని, నీళ్లందక పంటలు ఎండలేదని, కరెంటు కోతలు లేవని గుర్తుచేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు బారులు తీరి నిలబడాల్సిన అగత్యం కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని, కరెంటు, సాగునీళ్లు ఇవ్వకుండా, పంటలు కొనకుండా, బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మారిందని విమర్శించారు.
ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడంలో తనకున్న పేరును మరోసారి కాంగ్రెస్ నిలబెట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలోనే ప్రగతిభవన్ ముందు వేసిన కంచెను ఇప్పుడు తొలగించి రాక్షసానందం పొందారని, లక్షలాదిగా వచ్చిన ప్రజల దరఖాస్తులకు పరిషారాలు ఏవని ప్రశ్నించారు. ప్రజాభవన్ లో ఒకరోజు దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలుగా ముఖం చాటేశారని దుయ్యబట్టారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గొర్రెల పథకాలన్నీ ఫెయిల్ అని ప్రచారం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అన్న రేవంత్‌రెడ్డి, అదే ప్రాజెక్టు పరిధిలోని మల్లన్నసాగర్ నుంచి మూసీ, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు నీళ్లు తెచ్చేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారని గుర్తుచేశారు. సీఎంకు ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాధాన్యత తెలిసివచ్చిందన్నారు.