Singireddy Niranjan Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్ర నాయకులకు నోటీసులు ఇస్తున్న సిట్ కాంగ్రెస్ జేబు సంస్థగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy ) విమర్శించారు. కాంగ్రెస్ ప్రైవేట్ సైన్యంలా పోలీసు వ్యవస్థ తయారయిందని, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరికాయో సిట్ బయట పెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఆధారాల్లేని వార్తలతో కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ నేతల మీద బురద జల్లుతున్నాయని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలుగా మారి పోలీసులు తమ గౌరవాన్ని కోల్పోవద్దని హితవు పలికారు.
మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణకు పిలవడం వేధించడమేనని, వివరాలు తెలుసుకునేందుకు అంటూనే దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరించారు. సిట్ విచారణతో సంబంధం లేకుండా వస్తున్న వార్తలకు ఏ ఆధారాలు ఉన్నాయో.. సంబంధిత కథనాలు రాసిన మీడియా సంస్థలను ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు.